Mumbai: Man sentenced to 1.5 years in jail for calling minor girl 'item'
mictv telugu

ఏడేళ్ల క్రితం అమ్మాయిని అలా పిలిచినందుకు.. ఏడాదిన్నర జైలు శిక్ష

October 25, 2022

 

స్కూలు నుంచి ఇంటికి వెళ్తున్న ఓ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడో వ్యక్తి. ఆమె జుట్టు పట్టుకుని వేధిస్తూ, పిచ్చికూతలు కూశాడు. దీనిపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై కోర్టు విచారణ జరిపి, నిందితుడికి జైలు శిక్ష విధించింది. ముంబయి ప్రత్యేక పోక్సో కోర్టు ఓ మైనర్ వేధింపుల కేసులో గురువారం ఈ సంచలన తీర్పును వెల్లడించింది. ఓ మైనర్ను ‘ఐటమ్’ అని పిలిచిన యువకుడికి ఏడాదిన్నర జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.

2015లో 16 ఏళ్ల ఒక అమ్మాయి, స్కూలు నుంచి మధ్యాహ్నం ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో ముంబైకి చెందిన ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి రోడ్డు పక్కన కూర్చున్నాడు. ఇంటికి వెళ్తున్న బాలికను గమనించిన ఆ వ్యక్తి బైకుపై ఆమెను అనుసరించాడు. ఆ అమ్మాయి జుట్టు పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ‘హలో.. ఐటమ్ ఎక్కడికి వెళ్తున్నావు’ అని ప్రశ్నించాడు. ‘నేను కావాలనుకుంటే నిన్ను ఏమైనా చేస్తాను’ అంటూ వేధించాడు. ఈ క్రమంలో అమ్మాయి అతడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. కొద్ది దూరం జరిగి, వెంటనే 100కు డయల్ చేసింది. అయితే, పోలీసులు ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. ఆ లోపు బాలిక అక్కడ్నుంచి వెళ్లిపోయింది. కానీ, ఆ తర్వాత తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ జరిపారు. కోర్టులో అప్పటినుంచి ఈ కేసు విచారణ సాగుతోంది. ఇటీవల ఆ యువతి కూడా తన వాంగ్మూలం ఇచ్చింది. అయితే, నిందితుడు ప్రస్తుతం సత్ప్రవర్తనతో ఉన్నాడని, అందువల్ల అతడ్ని వదిలేయాలని అతడి తరఫు లాయర్లు వాదించారు. దీనికి కోర్టు నిరాకరించింది. అబ్బాయిలు ఉద్దేశ పూర్వకంగానే అమ్మాయిలను లైంగికంగా వేధించడానికే అలా పిలుస్తారని తెలిపింది. ఇలాంటి నేరాలను కఠినంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని.. రోడ్‌సైడ్ రోమియోలకు సరైన గుణపాఠం చెప్పాల్సిందేనని కోర్టు వ్యాఖ్యానించింది. నిందితుడి విషయంలో కనికరం చూపే ప్రసక్తే లేదని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌జే అన్సారీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బాలిక అతడిపై మోపిన అభియోగాలన్నీ నిజమని నమ్మిన కోర్టు.. తాజాగా అతడికి ఏడాదిన్నర జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.