Mumbai: Man tears up passport pages to hide Maldives trip from wife, ends up in prison
mictv telugu

ప్రియురాలితో మాల్దీవ్స్‌కు.. చించేసి అడ్డంగా దొరికిపోయాడు

July 9, 2022

Mumbai: Man tears up passport pages to hide Maldives trip from wife, ends up in prison
ఆఫీస్ పని మీద అఫీషియల్ ట్రిప్‌కు వెళ్తున్నానని భార్యకు అబద్ధం చెప్పి లవర్‌తో మాల్దీవ్‌లో ఎంజాయ్ చేశాడో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. తన భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఫోన్ కాల్స్ ఎక్కువవడంతో ఆ ట్రిప్‌ను మధ్యలోనే ముగించేసి వెనక్కి ప్రయాణం అయ్యాడు. కానీ, తన భార్యకు ఈ విషయం తెలియకూడదని పాస్‌పోర్టులో వీసా స్టాంప్ వేసిన పేజీలను చింపేశాడు. తిరిగి ముంబైకి ల్యాండ్ అయ్యాక ఇమిగ్రేషన్ అధికారుల వద్ద అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో అక్రమ సంబంధం విషయం భార్యకు తెలియడంతోపాటు ఆ నేరం కారణంగా జైలు పాలయ్యాడు. అసలేం జరిగిందంటే..

ముంబయికి చెందిన 32 ఏళ్ల వ్యక్తి మల్టీనేషనల్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రియురాలితో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేయడానికి.. కట్టుకున్న భార్యకి అబద్ధం చెప్పి, మాల్దీవులకు విహారయాత్రలకు వెళ్లాడు. అయితే తన భర్త టైమ్‌కి తింటున్నాడో లేదో అని కంగారు పడ్డ భార్య.. భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. వాట్సాప్ కాల్స్ చేసినా అదే పరిస్థితి. దీంతో భార్యకు అనుమానం వచ్చిందేమోనని కంగారుపడ్డ ఆ టెకీ.. మాల్దీవుల ట్రిప్‌ను దాచేందుకు తన పాస్‌పోర్ట్‌లోని వీసా స్టాంప్‌ పేజీలను చించేశాడు. భార్యకు దొరకడం ఇక అసంభవమని తాపీగా ముంబైకి చేరుకున్నాడు.

అసలు కష్టాలు అప్పుడు మొదలయ్యాయి. గురువారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండైన ఇంజినీర్ పాస్‌పోర్టులోని 3-6, 31-34 పేజీలు కనిపించకపోవడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమానించారు. అడిగిన ప్రశ్నలకు తప్పించుకునే ప్రయత్నం చేయడంతో వారు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అతడిపై మోసం, ఫోర్జరీ కేసులు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని విచారించగా చెప్పింది విని పోలీసులు విస్తుపోయారు. ప్రియురాలితో కలిసి మాల్దీవులకు వెళ్లానని చెప్పిన అతడు.. ఆ విషయం తన భార్యకు తెలియకుండా ఉండేందుకు పాస్‌పోర్టులో పేజీలను తానే చింపేశానని అంగీకరించాడు. పాస్‌పోర్టులోని పేజీలు చింపడం నేరమన్న సంగతి అతడికి తెలియదని పోలీసులు తెలిపారు. ఆ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను జైలుకు తరలించినట్లు తెలిపారు.