Mumbai police arrests gold biscuit smuggling gang in Tamilnadu
mictv telugu

కడుపులోని దొంగబంగారం గల్లంతు… అసలు విషయం తెలిసి షాక్..

July 25, 2022

హీరో సూర్య నటించిన తమిళ డబ్బింగ్‌ సినిమా వీడొక్కడే గుర్తుందా? అందులో కడుపులో డ్రగ్స్‌ తీసుకు వచ్చే సీన్‌ చూశారా… అలాంటిదే తమిళనాడులో చోటుచేసుకుంది. కాకపోతే ఈ ఘటనలో డ్రగ్స్‌కు బదులుగా బంగారం అక్రమ రవాణా చేశారు కొందరు వ్యక్తులు. అధికారుల కళ్లు గప్పి ముంబై నుంచి చెన్నైకు బంగారం అక్రమ రవాణా చేయించేవారు. వివరాల్లోకి వెళ్తే.. తిరువారూర్‌కు చెందిన హిజాబ్‌ చెన్నైలో సెల్‌ ఫోన్‌ దుకాణం నడుపుతున్నాడు. తన మిత్రుడు ఔరంగ జేబ్‌ ద్వారా ముంబై నుంచి చెన్నైకు బంగారం అక్రమంగా తెప్పించుకుంటూ వచ్చాడు.

ముంబై నుంచి బయల్దేరే ఔరంగజేబు మనుషులు చిన్న చిన్నగా ఉండే బంగారం బిస్కెట్లను మింగేసే వారు. చెన్నైకు వచ్చినానంతరం కడుపు శుభ్రం చేయించే మాత్రల ద్వారా వాటిని బయటకు తీసేవారు. ఈ పరిస్థితుల్లో ముంబైకు చెందిన శంకర్‌ ద్వారా 2 రోజుల క్రితం చెన్నైకు ఇదే తరహాలో బంగారం తీసుకొచ్చారు. అయితే, తీసుకొచ్చిన బంగారంలో ఓ బిస్కెట్‌ మాయమైంది. దీంతో అతణ్ని ఔరంగ జేబు, హిజాబ్, వారి అనుచరుడు విజయ్‌ కలిసి కిడ్నాప్‌ చేశారు. తిరువారూర్‌కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు.

అయితే ముంబైలో ఉన్న శంకర్‌ భార్య తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. బంగారం అక్రమ రవాణా గుట్టు వెలుగులోకి వచ్చింది. శంకకర్ ఆచూకీ కోసం ముంబై పోలీసులు చెన్నైకు వచ్చారు. ఇక్కడి పోలీసు సాయంతో శంకర్‌ సెల్‌ ఫోన్‌ నంబర్‌ ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. తిరువారూర్‌లో శంకర్‌ ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో కిడ్నాపర్ల చెర నుంచి అతడిని రక్షించి, ఆస్పత్రికి తరలించారు. ఔరంగ జేబు, విజయ్‌ను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నా రు. పరారీలో ఉన్న హిజాబ్‌ కోసం గాలిస్తున్నారు.