హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కోర్టు ఎదుట ముంబయి పోలీసుల అత్యుత్సాహం తిరిగి వారినే ఇరకాటంలోకి నెట్టింది. కోర్టు తీర్పుతో బెయిల్‌పై విడుదలైన నిందితుణ్ని అరెస్ట్ చేయబోయి, జడ్జీ కోపానికి గురయ్యారు. ఫలితంగా ఆ పోలీసులపైన కేసు నమోదు చేయాల్సి వచ్చింది. పోలీసులు, లాయర్లు తెలిపిన వివరాల ప్రకారం.. నైజీరియాకు చెందిన ఒకోరోకో ఇకేటు అనే వ్యక్తి ముంబయిలో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. వీసా గడువు ముగిసినా దేశంలో అక్రమంగా కొనసాగుతున్నాడు. రూ.4.5 కోట్ల విలువైన డ్రగ్స్ రవాణా చేసిన వ్యవహారంలో ముంబయి నార్కోటిక్ విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడి నుంచి పారిపోయిన ఆ వ్యక్తి హైదరాబాద్ చేరాడు.
నగరంలో ఓ డాక్టర్‌కు డికి మందులు పంపిస్తానంటూ నమ్మించి రూ.26 లక్షలు కొట్టేశాడు. ఈ కేసులో నిందితుణ్ని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి కూకట్‌పల్లిలోని కోర్టులో హాజరుపర్చారు. విచారించిన ఎనిమిదో మెట్రోపాలిటన్ జడ్జి భవాని నిందితుడికి బెయిలు మంజూరు చేశారు. నిందితుడు కోర్టు బయటకు రాగా అరెస్టు చేసేందుకు ముంబయి నార్కోటిక్ విభాగం ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు యత్నించారు. అతను ఆటో ఎక్కుతుండగా పోలీసులు చుట్టుముట్టడంతో నిందితుడు కేకలు వేశాడు. స్థానికులు, కోర్టు సిబ్బంది, కొందరు లాయర్లు జడ్జికి సమాచారం ఇచ్చారు.
జడ్జి బయటకొచ్చి వారిని లోపలికి రావాలంటూ ఆదేశించారు. మీరెవరంటూ సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబయి నార్కోటిక్ విభాగం పోలీసులమంటూ న్యాయమూర్తికి వివరించారు. ఒకోరోకోపై ముంబయిలో కేసు ఉందని చెప్పినా.. దానికి సంబంధించి అరెస్టు వారెంటు సహా పూర్తి వివరాల్ని జడ్డికి చూపించలేకపోయారు. అదే సమయంలో తనపై ముంబయి పోలీసులు దాడి చేశారంటూ ఒకోరోకో ఫిర్యాదు చేశాడు. దాంతో ఇద్దరు లాయర్ల సమక్షంలో వాదనలు రికార్డు చేసిన జడ్జి.. ముంబయి పోలీసులపై కేసు నమోదుకు ఆదేశించారు.