యువకుడి నగ్న ఫోటోలతో బెదిరింపులు.. ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

యువకుడి నగ్న ఫోటోలతో బెదిరింపులు.. ఆత్మహత్య

May 8, 2019

సరదాలు శ్రుతిమించితే ప్రాణాల మీదకు తెస్తాయి అనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. ఓ యువకుడి పాలిట తోటి స్నేహితులే కాలయములయ్యారు. ఓ యువకుడు నిద్రిస్తున్న సమయంలో అతని ఒంటిమీదున్న బట్టలు తొలగించి నగ్నంగా ఫోటోలు తీసి బెదిరించారు. దీంతో అతను తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్ర పాల్‌ఘర్‌ జిల్లాలో చోటు జరిగింది. బోయిసర్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న నలుగురు స్నేహితులు కలిసి కంపెనీకి దగ్గర్లోనే ఓ గది అద్దెకు తీసుకుని అందులో వుంటున్నారు.

Mumbai Roommates get drunk, strip one and click pictures; drive him to suicide

బ్యాచ్‌లర్ రూం కాబట్టి మందులు, చిందులు సహజమే. ఓరోజు రూంలో నలుగురిలో ముగ్గురు మద్యం సేవించారు. ఓ యువకుడు మాత్రం నిద్రిస్తున్నాడు. బాగా తాగిన ఆ ముగ్గురికి ఓ పాడు ఆలోచన పుట్టింది. పడుకున్న యువకుడి ఒంటిమీద నుంచి బట్టలు తొలగించారు. నగ్నంగా చేసి ఫోటోలు, వీడియోలు తీశారు. మరుసటి రోజు ఆ ఫోటోలు చూపించి సదరు యువకుడిని బ్లాక్‌మెయిల్‌ చేశారు. ఈ ఫోటోలను తమ ఫోన్ల నుంచి తొలగించాలంటే డబ్బులు ఇవ్వాలని లేని పక్షంలో సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తామని బెదిరించారు.

తాము పని చేస్తున్న కంపెనీలో కూడా ఆ యువకుడిని బెదిరించాడు. దీంతో సదరు యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తాను ఉంటున్న గదిలోనే ఉరేసుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి మొబైల్‌ను పోలీసులు సీజ్‌ చేశారు.