గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతతో.. ముంబైవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజా పరిశోధనల్లో దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ఆ నగరం.. ఓ చెత్త రికార్డును మూటగట్టుకుని వార్తల్లో నిలించింది. ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో ముంబై రెండో స్థానంలో ఉన్నట్లు తెలిసింది. స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ IQAir(ఐక్యూ ఎయిర్).. జనవరి 29 మరియు ఫిబ్రవరి 8 మధ్య నమోదైన కాలుష్యం ఆధారంగా ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాను తయారుచేసింది. ఈ జాబితాలో ముంబై రెండవ స్థానంలో ఉంది.
జనవరి 29న ఇదే ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న ముంబై.. ఫిబ్రవరి 2న ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా తొలిస్థానానికి చేరుకుంది. తర్వాత ఫిబ్రవరి 8న మళ్లీ రెండో స్థానానికి చేరుకుంది. ఫిబ్రవరి 13న, వాయు నాణ్యతలో ప్రపంచవ్యాప్తంగా మూడో అత్యంత అనారోగ్యకరమైన నగరంగా నిలిచింది, భారతదేశంలో అత్యంత కలుషితమైన నగరంగా ఇప్పటివరకూ చెప్పుకునే ఢిల్లీని కూడా ముంబై అధిగమించింది.
గతేడాది నవంబర్ తో పాటు ఈ ఏడాది జనవరి నెలల్లో ముంబైలో గాలి నాణ్యత ఎక్కువగా ‘పూర్’, ‘వెరీ పూర్’ కేటగిరీలోనే నమోదైందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాహనాల నుంచి వెలువడే కాలుష్యం, రోడ్లపై ఎగిసిపడే దుమ్ముధూళి వల్ల గాలి నాణ్యత పడిపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చలికాలం కావడం, నిర్మాణ వ్యర్థాలు ఈ పరిస్థితికి కారణమని వెల్లడించారు. లా నినా సైక్లోన్ ఎఫెక్ట్ తో గాలి వేగం నెమ్మదించడం వల్ల కూడా ఎయిర్ క్వాలిటీ పడిపోయిందని పేర్కొన్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి సమాచారం సేకరించి ఈ సర్వేను చెప్పట్టినట్లు ఐక్యూ ఎయిర్ తెలిపింది.