స్లమ్ బార్న్ టాలెంట్.. మురికివాడ పిల్లోడికి ప్రపంచం జైకొట్టింది.. - MicTv.in - Telugu News
mictv telugu

స్లమ్ బార్న్ టాలెంట్.. మురికివాడ పిల్లోడికి ప్రపంచం జైకొట్టింది..

May 16, 2019

అదో మురికివాడ.. దుర్వాసన, ఇరుకు ఇరుకు గుడిసెలు, టెంట్లు, సరైన బాత్రూములు లేవు. నాగరిక సమాజానికి ఉండాల్సిన ఏ సదుపాయాలూ లేవు. అక్కడ పుట్టాడు ఆ చిన్నోడు. నటన అంటే చిన్నప్పటి నుంచీ ప్రాణం. సినిమా అతని కలల ప్రపంచం. మెల్లిగా రెక్కలు విప్పాడు. పడరాని పాట్లు పడ్డాడు. విసిగిపోయాడు. మళ్లీ సత్తువ తెచ్చుకుని పైకి లేచాడు. ప్రేక్షకులను నటనతో కట్టి పడేసి, అంతర్జాతీయ వేదికపై మెరిసిపోయాడు.

Mumbai slum boy Sunny Pawar bags Best Child Actor award at New York Indian Film Festival, wants to be ‘a big actor like Rajinikanth’

ముంబైలోని కుంచికార్వే మురికివాడలో జన్మించిన 11 ఏళ్ల సన్నీపవార్.. 19వ న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ బాలనటుడి పురస్కారం కొల్లగొట్టాడు. ‘చిప్పా’ చిత్రంలో నటనకుగాను జ్యూరీ అతనికి ఫిదా అయింది. సఫ్దార్ రెహ్మాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అందులోనూ సన్నీ బాలనటుడి వేషమే వేయడం మరో విశేషం. కనిపించకుండా పోయిన తండ్రిని వెతికే పిల్లాడి పాత్రలో సన్నీ మెప్పించాడు. భావోద్వేగాల సన్నివేశాల్లో అతి సులువుగా నటించాడు.

సన్నీ.. 2016లో వచ్చిన ‘లయన్’ చిత్రంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. 2000 మంది పిల్లలను పరీక్షించి చివరికి అతణ్ని ఈ చిత్రం కోసం తీసుకున్నారు. దాదాపు ఐదేళ్లుగా కెమెరా ముందు నిల్చుంటున్న సన్నీకి తాజా అవార్డుతో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.  

Mumbai slum boy Sunny Pawar bags Best Child Actor award at New York Indian Film Festival, wants to be ‘a big actor like Rajinikanth’

‘‘నాకెంతో సంతోషంగా ఉంది. ఇదంతా నా తల్లిదండ్రుల కష్ట ఫలితమే. నేను రజినీకాంత్  అంత పెద్ద నటుణ్ని కావాలనుకుంటున్నాను. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ నటిస్తాను. అమ్మా నాన్నల కోసం నేను పేద్ద ఇల్లు కొనాలి. నేను బరాక్ ఒబామాను కలిశారు. అతడు నాకు నమస్తే పెట్టి, నన్ను అభినందించారు.. ’ అని పొంగిపోతున్నాడు బుడ్డోడు. సన్నీ నటనలోనే కాదు చదువులోనూ దూసుకెళ్తున్నాడు. ఎయిరిండియా మోడల్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు.