Munnur ravi and Raghavender Raju backgrounds in Telangana minister Srinivas goud case
mictv telugu

మంత్రి శ్రీనివాస్ హత్యకు కుట్ర… ఎవరీ మున్నూరు రవి ?

March 3, 2022

Munnur ravi and Raghavender Raju backgrounds in Telangana minister Srinivas goud case

ఏకంగా రాష్ట్ర కేబినెట్ మంత్రినే చంపడానికి పన్నిన కుట్ర తెలంగాణ రాజకీయాలతోపాటు ఢిల్లీలోనూ కలకలం రేపుతోంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించడానికి పన్నిన కుట్రను భగ్నం చేసి, నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నా, ఈ వ్యవహారం వెనుక బయటికి రాని చీకటి కోణాలెన్నో ఉన్నట్టు తెలుస్తుంది. టీఆర్ఎస్, బీజేపీ నేతల పరస్పరణ ఆరోపణలు, పోలీసులు, నిందితులు, నిందితుల బంధువులు వాదనలు దీనికి ఊతమిస్తున్నాయి. కీలక నిందితులైన రాఘవేందర్ రాజు, మున్నూరు రవిల నేపథ్యం, మంత్రిపై నిందితుల ఆరోపణలు రక్తికట్టించే పాలిటికల్ డ్రామాను తలపిస్తున్నాయి.

తొలి నుంచీ గొడవలే..

నిందితులైన రాఘవేందర్ రాజు, అతని ముగ్గురు తమ్ముళ్లకు శ్రీనివాస్ గౌడ్‌తో తొలి నుంచీ గొడవలు ఉన్నాయి. ఒకరినొకరు ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతీసుకునే ప్రయత్నాలు సాగాయి. కేసులు కూడా నడుస్తున్నాయి. 2018 ఎన్నికల్లో శ్రీనివాస్ తప్పుడుఅఫిడవిట్ సమర్పించారని, స్థానిక ఎన్నికల్లో ఈసీ వెబ్‌సైట్‌ను ట్యాంపర్ చేయించారని ఆరోపిస్తూ రాఘవేందర్ రాజు 2019లో కోర్టులో కేసు వేశారు. శ్రీనివాస్ ఎన్నికను రద్దు చేసి, మళ్లీ ఎన్నికలు జరపాలని కోరారు. మంత్రి ఈ ఆరోపణలు కొట్టేశారు. శ్రీనివాస్ తన కుటుంబాన్ని తీవ్రంగా వేధించారని, 30 అక్రమ కేసులు బనాయించారని, అందుకే చంపాలనుకున్నానని రాఘవేందర్ చెప్పాడు.

‘ఉద్యమ రవి’ నుంచి కుట్ర అరోపణల దాకా..

Munnur ravi and Raghavender Raju backgrounds in Telangana minister Srinivas goud case
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మున్నూరు రవి.. శ్రీనివాస్ హత్యకుట్రలో అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘమైన టీఆర్ఎస్వీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రవి సోషల్ మీడియాలో క్రియాశీలంగా ఉంటారు. ప్రభుత్వాన్ని, కేసీఆర్, కేటీఆర్‌లను కొనియాడుతూ పోస్టులు పెడుతుంటారు. టీఆర్ఎస్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో రవికి సంబంధాలు ఉన్నట్లు సమాచారం. రవి అరెస్టయింది ఢిల్లీలోని జితేందర్ ఇంట్లోనే. ‘వ్యక్తిగత’ పనుల కోసం ఢిల్లీ వెళ్లిన రవి హత్యకుట్ర నిందితులతో కలసి జితేందర్ వీఐపీ నివాసంలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రవిపై పెట్టిన కేసులు ఇంకా రద్దు కాలేదు. అంతేకాకుండా పాత కేసులు తిరగదోడి వేధించారని, గత నెల 28న జరిగిన రవి కిడ్నాప్ వెనక మంత్రి శ్రీనివాస్ హస్తముందని రవి బంధుమిత్రులు ఆరోపించారు. ఇదిలా ఉంటే, టీఆర్ఎస్‌కు వీరాభిమాని అయిన రవి బీజేపీ నేత ఇంట్లో అరెస్ట్ కావడం ఆసక్తికర అంశం. తన ప్రాంతానికి చెందిన వారెవరు వచ్చినా ఆశ్రయం ఇస్తానని, రవి గతంలోనూ తన ఇంటికి వచ్చాడని జితేందర్ వివరణ ఇచ్చారు.