Munugode By-poll: 41.3 percent till 1pm for one of most monitored elections in Telangana
mictv telugu

తరలివస్తున్న మునుగోడు ఓటర్లు.. ఒంటి గంట వరకు 41.3 శాతం ఓటింగ్

November 3, 2022

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ కాస్త మందకొడిగా సాగినా.. ఆ తర్వాత గంటగంటకూ ఊపందుకుంటోంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించగా.. కాసేపు పోలింగ్‌ నిలిచిపోయింది. మరమ్మతుల అనంతరం యధావిధిగా పోలింగ్‌ కొనసాగుతోంది. పోలింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈసీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ఈసీ కార్యాలయం నుంచి ఈసీ డేగకన్నుతో పోలింగ్‌ సరళిని పర్యవేక్షిస్తోంది.

వృద్ధులు, మహిళలు, యువత ఓటు వేసేందుకు ఉత్సాహంగా తరలివస్తున్నారు. వికలాంగులు, అనారోగ్యం, ప్రమాదాల బారిన పడిన వారు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు పోలింగ్ సరళిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. మునుగోడులో ఉదయం 9 గంటల వరకు 11.2 శాతంగా నమోదైన పోలింగ్.. 11 గంటల వరకు 25.8 శాతం నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 41.3 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2018 ఎన్నికల్లో మనుగోడు నియోజకవర్గంలో 91 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది.