Munugode by poll :Roti Maker Symbol Damages Huge Votes of TRS
mictv telugu

కారు ఓట్లకు గండి కొడుతున్న రోడ్డు రోలర్, రోటీ మేకర్

November 6, 2022

మునుగోడు ఉప ఎన్నిక‌ ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. కౌంటింగ్‌లో ఒక్కో రౌండ్‌లో ఒక్కో పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి కారును పోలిన గుర్తులు త‌లనొప్పి తీసుకొస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. గత ఎన్నికల అనుభవంతో.. రోడ్డు రోల‌ర్‌, రొట్టెల పీట వంటివి అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయని, వాటిని మార్చాల్సిందిగా ఈసీని అభ్య‌ర్థించింది టీఆర్ఎస్. అయితే దానికి ఎన్నిక‌ల సంఘం ఒప్పుకోలేదు. ఇక చేసేదేమీ లేక ఎన్నిక‌ల బ‌రిలో దిగింది. తాజాగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కౌంటింగ్‌లో భాగంగా చేపట్టిన చౌటుప్ప‌ల్ మండ‌లం ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారును పోలిన గుర్తులు భారీగా డ్యామేజీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఊహించిన దానికంటే ఆ పార్టీకి తక్కువ ఓట్లు రావడం ఓ కారణం.. కాగా.. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీచేసిన మార‌మోని శ్రీశైలం అనే వ్య‌క్తి ఒక్కో రౌండ్‌లో ఓట్లు భారీగా నమోదవడం మరో కారణం. రొట్టెల పీట గుర్తుతో బరిలోకి నిలిచిన ఆయనెవ‌రో కూడా ఓటర్లకు పెద్ద‌గా తెలియ‌దు. కానీ ఓట్లు మాత్రం రౌండు రౌండుకూ పెరుగుతున్నాయి. ఒక్కో రౌండ్లో రెండు వంద‌లు.. మూడు వంద‌ల ఓట్లు వ‌స్తున్నాయి. దీంతో రొట్టెల పీట కారుకు లేనిపోని స‌మ‌స్య తీసుకొచ్చేట్లే ఉంద‌ని టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు నెత్తిప‌ట్టుకుంటున్నారు. చివ‌రి ఫ‌లితం వ‌చ్చేవ‌ర‌కు గానీ చెప్ప‌లేం కారుకు ఏ గుర్తు ఎంత డ్యామేజీ చేసిందో!