Munugode Bypoll
mictv telugu

మునుగోడు ఓటరు నాడి తెలియక…

November 3, 2022

Munugode Bypoll

మునుగోడు పోలింగ్ ముగిసింది. నేతల్లో టెన్షన్ మొదలైంది. ఓటర్ నాడి తెలియక కంగారుపడుతున్నారు. గెలుపుపై ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తునప్పటికీ లోలోపల కంగారుపడుతున్నారు. అంచనాలు నిజమవుతాయా?లేదా లెక్కతప్పుతాయా? అని ఆందోళన చెందుతున్నారు. తొలినుంచి బయటపడని మునుగోడు ఓటర్…పోలింగ్ చివరిదాకా అదే సస్పెన్స్ మెయింటైన్ చేశాడు. మొత్తానికి విజయం ఎవరిని వరించేనో తెలియాలంటే ఆరో తేదీదాకా ఆగాల్సిందే.

రికార్డ్ పోలింగ్..ఎవరికి ప్లస్..?

మునుగోడు ఉప ఎన్నికలో రికార్డ్ స్థాయి పోలింగ్ నమోదైంది. పోలింగ్ సమయం ముగిసినా క్యూ లైన్లలో ఓటర్లు బారులు తీరి ఉన్నారు.సాయంత్రం అయిదు గంటల వరకు 77.55 శాతం పోలింగ్ నమోదైంది. చివరి గంటే గత రికార్డ్‌ని బ్రేక్ చేస్తుందని అధికారులు అంటున్నారు. గురువారం సాయంత్రం 5 గంటలదాకా లక్షా 87వేల 527 మంది ఓట్లు వేశారు. ఉదయం నుంచి నిలకడగా సాగిన పోలింగ్ …సాయంత్రం ఊపందుకుంది. తొలి నాలుగు గంటల్లో 25.8శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఓటర్లు బారులు తీరారు. 11 గంటలకు 25.8 శాతం ఉన్న ఓటింగ్..మధ్యాహ్నం ఒంటివరకు 41.30 శాతానికి వెళ్లింది. సాయంత్రం 3 గంటలవరకు 59.92 శాతం నమోదైంది. చివరి రెండుగంటల్లో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్ నమోదైంది. 2018లో 91.3శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పుడు ఈ రికార్డ్ బ్రేక్ అవుతుందని అధికారులు అంటున్నారు.

మొత్తానికి ప్రశాంతంగా…

స్వల్ప ఉద్రిక్తతలు మినహా..పోలింగ్ ప్రశాంతంగా సాగింది.చండూరులో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. టీఆర్ఎస్ నాయకులు నాన్ లోకల్స్‌ను బయటకు పంపకుండా అడ్డుకుంటున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. మర్రిగూడెం మండలం శివన్నగూడెనికి వచ్చిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని టీఆర్ఎస్ , కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలింగ్ స్టేషన్‌లోనికి వెళ్లొద్దంటూ నినాదాలు చేశారు. మరోవైపు పలు పోలింగ్ బూత్‌ల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఒకటి రెండు చోట్ల అధికారులు పోలింగ్‌ను నిలిపివేశారు. మరికొన్ని ఈవీఎంలను వెంటనే రిపేర్ చేశారు.

ఓటింగ్ బహిష్కరణ

గట్టుప్పల్ మండలంలోని రంగతండాను పంచాయతీ చేయాలని గ్రామస్తులు ఓటింగ్‌ను బహిష్కరించారు. తమ గ్రామంలో అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. మౌలిక వసతులు సరిగా లేవని సర్కార్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఓట్లు వేయలేదు.స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఓట్లు వేయమని తేల్చిచెప్పారు.