Munugode Loss..but BJP Gaining Votes...
mictv telugu

మునుగోడులో ఓడినా బీజేపీకి ప్లస్సే..!

November 7, 2022

మునుగోడులో ఓడినా బీజేపీకి ప్లస్సే కాబోతుందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా మారబోతుదా? కాంగ్రెస్ కంచుకోటను కదిలించి రెండోస్థానంలో పాగా వేసిందా? మునుగోడు ఫలితాన్ని చూస్తే అవుననే అనిపిస్తుంది.

కమల వికాసం

మునుగోడులో టీఆర్ఎస్‌కు బీజేపీ గట్టి పోటీనిచ్చింది. ఓ దశలో కారు స్పీడ్‌కు బ్రేక్ వేస్తుందేమోనని అంతా అనుకున్నారు.కానీ టీఆర్ఎస్ గెలుపుని కాకుండా మెజారిటీని మాత్రమే తగ్గించగలిగింది. కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు చేసి మునుగోడులో రెండోస్థానంలో నిలిచింది. ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 86.697 ఓట్లు వచ్చాయి. 2018లో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్ రెడ్డికి 12,725 ఓట్లు పడ్డాయి. అప్పుడు బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు బీజేపీ రెండోస్థానంలోకి వచ్చింది. గతంతో పోలిస్తే 73.972 ఓట్లు పెరిగాయి.

కాంగ్రెస్ కంచుకోట

మునుగోడు మొన్నటిదాకా కాంగ్రెస్ కంచుకోట. కాంగ్రెస్‌కు హ్యాండిచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా,తరుణ్ చుగ్ లు కోమటిరెడ్డి తరఫున ప్రచార సభల్లో పాల్గొన్నారు. మునుగోడు కోసం కమిటీలు వేసి ప్రచార సరళిని నేతలు పర్యవేక్షించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ మునుగోడులోనే మకాం వేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోసం క్యాంపెయిన్ చేశారు. ఇంత చేసినా బీజేపీ చివరకు కారు స్పీడ్‌ని అడ్డులేకపొయింది. కాంగ్రెస్ కంచుకోటను మాత్రం కదిలించింది. ఆ పార్టీకి డిపాజిట్ లేకుండా చేసి బీజేపీ ద్వితీయ స్థానంలోకి వచ్చింది. మొత్తానికి బీజేపీకి ఓట్లు పెరగడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అంచనాల్ని పెంచింది.

ఓడినా,గెలిచినా ప్లస్సే…

మునుగోడులో గెలిచినా, ఓడినా బీజేపీకే లాభం. రెండు రకాలుగా తమకే అనుకులంగా ఉంటుందని ఆ పార్టీ మొదటి నుంచి అంచనా వేస్తూ వచ్చింది. గెలుపు కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసింది.ఆఖరకు రెండోస్థానంతో సరిపెట్టుకుంది. ఈ కేడర్‌నే ఇలాగే నిలుపుకోవాలని బీజేపీ చూస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది.