Munugode MLA Rajagopal reddy comments on TRS Government and cm kcr
mictv telugu

‘గంగుల, ఎర్రబెల్లి, తలసాని, పువ్వాడ ఉద్యమకారులా?’

August 8, 2022

కాంగ్రెస్‌ పార్టీతో పాటు, తన ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన రాజీనామా లేఖను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఆయన అందజేశారు. అంతకుముందు గన్‌పార్కులో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ కుటుంబం అరాచక పాలన కొనసాగిస్తోందన్నారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని మండిపడ్డారు. తన రాజీనామాతో జరిగే ఉప ఎన్నికలో మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇస్తారని, తెలంగాణకు కేసీఆర్‌ నుంచి విముక్తి కల్పిస్తారన్నారు

సీఎంకు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌ తప్ప ఇతరుల నియోజకవర్గాలు కనిపించడం లేదని అన్నారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలవాలని చూస్తే అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని అన్నారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. మిషన్‌ భగీరథలో రూ.25వేల కోట్లు దోచుకున్నది నిజం కాదా? అని నిలదీస్తూ.. ఈరోజు రాష్ట్రంలోని ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తెరాస తెలంగాణ ద్రోహుల పార్టీగా మారింది. మంత్రులు గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పువ్వాడ అజయ్‌ ఉద్యమకారులా? అని ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదన్నారు. నిరుద్యోగులు, ప్రజలకు వైద్యం, పేదలకు ఇళ్లు, పింఛన్ల కోసం రాజీనామా చేశానని చెబుతూ, రాజీనామా అనగానే ఇప్పటికప్పుడు ప్రత్యేకంగా గట్టుప్పల్‌ మండలం ఏర్పాటు చేస్తున్నారని సీఎం కేసీఆర్ ను విమర్శించారు.