నేటితో ప్రచారం బంద్.. మూగబోనున్న మైకులు - MicTv.in - Telugu News
mictv telugu

నేటితో ప్రచారం బంద్.. మూగబోనున్న మైకులు

November 1, 2022

Munugode poll campaign ends today, stakes high for 3 parties

తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నికలో నేటితో ప్రచారం బంద్ కానుంది. పరస్పర ఆరోపణలు, నాయకుల కొనుగోళ్లు, ఓటర్లకు ప్రలోభాలు, సభలు, సమావేశాలు, ఇంటింటి సందర్శనలతో సాగిన  ప్రచారం మంగళవారం సాయంత్రం ఆరుగంటలకు ముగియనుంది. ఉపఎన్నిక ప్రచారంతో గత రెండు నెలలుగా మైకులు దద్దరిల్లగా.. ఇవాళ సాయంత్రం నుంచి ఉపఎన్నిక కౌంటింగ్ ముగిసేవరకు అవన్నీ మూగబోనున్నాయి.

చివరి దశలో పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం చేస్తోన్నాయి. ఓటర్లకు ఆకట్టుకునే పనిలో తలమునకలయ్యాయి. చివరి నిమిషంలో ప్రలోభాల పర్వంలో పార్టీలు మరింత జోరు పెంచాయి. ప్రచార చివరిరోజు వీలైనంత మంది ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోన్నాయి. ప్రచారం ముగింపు రోజున టీఆర్ఎస్ తరఫున మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు రోడ్‌షోలు నిర్వహించనుండగా, బీజేపీ కొన్ని మండలాల్లో బైక్‌ ర్యాలీలు, కాంగ్రెస్‌ మహిళా గర్జనను నిర్వహించనున్నాయి. ఇక  కాంగ్రెస్‌ కూడా తన సిట్టింగ్ స్థానాన్ని పదిలం చేసుకునేందుకు సమావేశాలు జరుపనుంది.

ఇక ఉప ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనున్నదని, 6 గంటల తర్వాత నియోజకవర్గంలో ఉంటున్న స్థానికేతరులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించింది. స్థానికంగా ఓటు హక్కు లేనివాళ్లు ఎవరైనా నియోజకర్గంలో కనిపిస్తే ఎన్నికల నిబంధనల ఉల్లంఘన ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రచారం చేయడానికి వీల్లేదని, సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయకూడదని ఈసీ స్పష్టం చేసింది. ఈ నెల 3న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు.