Munugode Victory Boost To BRS
mictv telugu

మునుగోడు గెలుపు బీఆర్ఎస్‌కు మలుపు కాబోతుందా?

November 7, 2022

Munugode Victory Boost To BRS

మునుగోడు గెలుపు బీఆర్ఎస్‌ను మలుపు తిప్పబోతుందా? జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ అస్త్రంగా మార్చుకోబోతున్నారా?బై పోల్ విక్టరీని ప్రొజెక్ట్ చేస్తూ బీజేపీని ఎండగట్టబోతున్నారా? జాతీయ స్థాయిలో భారత్ రాష్ట్ర సమితి విస్తరణకు మునుగోడు గెలుపు కీలక మలుపుగా టీఆర్ఎస్ భావిస్తుందా?

అప్పుడు టీఆర్ఎస్..ఇప్పుడు బీఆర్ఎస్…

2001 లో సిద్ధిపేట ఉపఎన్నికలో గెలుపు ద్వారా కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పారు. ఇప్పుడు మునుగోడు గెలుపు జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్‌కు మలుపు కాబోతోందని టీఆర్ఎస్ అంచనా వేస్తుంది. బీజేపీ ఎన్నికల రాజకీయాల్ని ఎండగట్టేలా మునుగోడు విక్టరీని టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయబోతోంది.బీఆర్ఎస్ పనుల్ని కేసీఆర్ సేన వేగవంతం చేసింది. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మారుస్తూ పేపర్లలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఎవరికైనా అభ్యంతరాలుంటే 30రోజుల్లోగా ఈసీకి తెలియచేయాలని టీఆర్ఎస్ కోరింది. బీఆర్ఎస్ పనులు త్వరగా పూర్తి అయితే పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయొచ్చని టీఆర్ఎస్ భావిస్తోంది.

ఒకేదెబ్బకు రెండు పిట్టలు

మునుగోడు గెలుపుతో ఒకే దెబ్బకు టీఆర్ఎస్ రెండు పిట్టల్ని పడగొట్టింది. కంచుకోటలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు చేసింది.ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌కు ఒకప్పుడు గట్టి పట్టు ఉండేంది. హుజూరునగర్ , నాగార్జున సాగర్, మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి.ఇప్పుడు అన్నింటిని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ను కోలుకోలేని విధంగా దెబ్బకొట్టింది. జిల్లాలో మొన్నటిదాకా ఉన్న రెండోస్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. ఈ ఎఫెక్ట్ తో కాంగ్రెస్‌లో జరగబోయే పరిణామాల్ని నిశితంగా టీఆర్ఎస్ గమనిస్తోంది.

కమలంపై నజర్

మునుగోడు గెలుపు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ప్రొజెక్ట్ చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణలో బీజేపీ ఇంతకు ముందులా దూకుడుగా ఉంటుందా? లేక నెమ్మదిస్తుందా? అని ఎదురుచూస్తుంది. బీజేపీ వ్యూహం ఎలా ఉంటుందని కోణంపై నజర్ పెట్టింది. 2023 లో మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కసరత్తు చేస్తుంది. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ వేయాల్నిన అడుగులపై కేసీఆర్ నాయకత్వంలో ఓ బృందం కసరత్తు చేస్తుంది.