మునుగోడులో ఓటర్ల వింత కోరికలు..నేతలకు తప్పని పరేషాన్..! - MicTv.in - Telugu News
mictv telugu

మునుగోడులో ఓటర్ల వింత కోరికలు..నేతలకు తప్పని పరేషాన్..!

October 25, 2022

సమావేశానికి వచ్చారా..బిర్యానీ తిన్నారా..మందుబాటిల్ అందిందా..?మహిళలైతే 5 వందలు తీసుకున్నారా..?మునుగోడులో ఏపార్టీ నేత నోట చూసినా ఇవే మాటలు.అబ్బబ్బ ఏం మర్యాద.మర్యాద అంటే మునుగోడు..మునుగోడు అంటే మర్యాద.అవును నిజం. ఇదంతా బై ఎలక్షన్ దాకే. ఈ విషయం ఓటర్లకూ తెలుసు..మర్యాద ఇస్తున్న నేతలకూ ఇంకా బాగా తెలుసు. ఓటేసేదాకా మర్యాద మల్లన్న..ఓటేశాక బోడిమల్లన్న..అందుకే నాయకుల్ని మించి ఓటర్లు ఆలోచిస్తున్నారు. మొహమటం లేకుండా పార్టీల ముందు వింత కోరికల చిట్టా విప్పుతున్నారు.

వింతకోరికల చిట్టా

మునుగోడు ఓటర్ మైండ్ సూపర్ షార్ప్.ఉప ఎన్నిక వేళ ఇంకా బాగా పనిచేస్తుంది.మూమూలుగా కాదు ఓ రేంజ్‌లో వింత కోరికల్ని నాయకుల ముందు ఉంచుతున్నారు. “మీరిచ్చే మర్యాద ఈ ఎన్నిక అయ్యేదాకేనని మాకు తెలుసు..ముందు ఏమేం ఇస్తావో చెప్పు” అని తెగేసి అడుగుతున్నారు.”ఆ పార్టీ వాళ్లు ఇంత ఇస్తున్నారు. మీరు అంతకు డబుల్ ఇస్తారా లేదా” అని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొందరైతే డబ్బులు వద్దు బంగారమైతే బెటరంటున్నారు. ఇంటికో తులం బంగారం ఇస్తారని ఆశిస్తున్నారు. ఇప్పుడైతే ఓటుకు రూ.10వేలు..ఎలక్షన్ ముందు రోజు వరకు ఆగితే రూ.30 వేలు కూడా ఇవ్వొచ్చని కొందరు ఓటర్లు అంటున్నారు.

మందుబాబుల మాట ఇదే

రణగోడు మంచి కిక్కు ఇస్తోంది. పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రిపడుకునేదాకా నిషా తెప్పిస్తోంది. చుక్క,ముక్కతో కొందరు ఓటర్లు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రచారం చేస్తూనే మత్తులో జోగుతున్నారు. ఇస్తున్న మందు కాస్తా బ్రాండెడ్ ఇస్తే ఇంకా బాగుంటుందని కొందరు ఓటర్లు అంటున్నారు.నిషాలో ఉన్నా నిప్పులాంటి నిజాలు కక్కేస్తున్నారు. మునుగోడు సాక్షిగా ఒక్క పార్టీకి కమిట్ అయ్యేది లేదు..అన్ని పార్టీలు మావేనని చెబుతున్నారు ఇంకొందరు. లీడర్లు పూటకోపార్టీ మారితే లేని తప్పు..మేం పార్టీలు మారిస్తే ఉందా అని ప్రశ్నిస్తున్నారు.

ఎవరెన్ని డబ్బులు ఇచ్చినా..?

Hyderabad 5th June 2014 ; Boozing in public places goes unabated. Many sip it right before the liquor outlets on the roads causing inconvenience. Picture by P.Surendra

మామూలుగా ఉన్నా, మత్తులో ఉన్నా…ఓటు వేసేదానిపై మునుగోడు వాసులు క్లారిటీగా ఉన్నారు. ఎవరెన్ని డబ్బులు పంచినా వేసేవారికే ఓటు వేస్తామని తేల్చిచెబుతున్నారు.అలాంటప్పుడు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే..వాళ్లు ఇస్తున్నారు మేం తీసుకుంటాం. వాళ్లు ఇవ్వకపోతే మేం ఎందుకు తీసుకుంటామంటున్నారు.

కూలీలు అంతా అక్కడికే క్యూ

మునుగోడులో కూలీలు అంతా ప్రచారానికి క్యూకడుతున్నారు. రోజుకో పార్టీ సమావేశానికి వెళ్తున్నారు. ఈ సమావేశానికి వెళ్తే ఒక్కొక్కరికి రూ.500 లు ఇస్తున్నారు. మధ్యాహ్నం మాంహార భోజనంతోపాటు డబ్బు ఇస్తున్నారు. తాగేవారికి మందు,తాగని వాళ్లకు కూల్ డ్రింక్స్ పోస్తున్నారు. ఈ ఎఫెక్ట్ అంతా రైతులపై పడింది. పొలాల్లో పనులు చేసేందుకు కూలీలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు మొహమాటంతో ప్రచారానికి వెళ్లలేని వాళ్లు…ప్రత్తి ఎరేందుకు వెళ్తున్నారు. కిలో రూ.10 చొప్పున పత్తిఏరుతున్నారు రోజుకు 20 నుంచి 30 కిలోలదాకా తీస్తున్నారు. దీని కన్నా ప్రచారానికి వెళ్లిన వాళ్ల పనే బాగుందంటున్నారు. బై పోల్ ఏమోగానీ తమకు కూలీలు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు.

ఈసీకి కనిపించని మునుగోడు సిత్రాలు

మునుగోడులో మద్యం, డబ్బు ఏరులై పారుతున్నా ఈసీకి కనిపించడం లేదు. పేపర్లలో ఐటెమ్స్ వస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి.ఎన్నికల ఖర్చు దేశంలో నయా రికార్డు కాబోతుందని పార్టీల నేతలే చెబుతున్నారు.అయినా ఇవేవి ఈసీ దృష్టికి వెళ్లడం లేదు. అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల వ్యయం లిమిట్స్ ని దాటి వెయ్యింతలు ఖర్చుచేశారని ప్రచారం జరుగుతోంది. పోలింగ్ నాటికి దేశంలోనే కాస్ట్లీ బై పోల్ గా రికార్డ్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.ఎందుకంటే ఓటర్ల కోరికలు అట్లున్నాయి మరి.