ఓటుకు రూ.3 వేలేనా?.. ప్రశ్నిస్తున్న మునుగోడు మహిళలు - MicTv.in - Telugu News
mictv telugu

ఓటుకు రూ.3 వేలేనా?.. ప్రశ్నిస్తున్న మునుగోడు మహిళలు

November 2, 2022

Munugode voters say that the leaders cheated them during the campaign

 

మునుగోడు నియోజకవర్గంలో పార్టీల ప్రచారం నిన్నటితో మూగబోయింది. ప్రచారంలో ఓటుకు రూ.20 వేలు, రూ.30 వేలు ఇస్తాం.. తులం బంగారం ఇస్తామని చెప్పిన నాయకులు.. తమను మోసం చేశారంటున్నారు అక్కడి ఓటర్లు. ఇరవై రోజుల కిందట ఓటుకు తులం బంగారం అని చెప్పి తీరా చివరకు రూ.3 వేలు పంచుతున్నారని ముఖ్యంగా మహిళ ఓటర్లు ప్రధాన పార్టీల నేతలను ప్రశ్నిస్తున్నారు. సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని ఓ గ్రామంలో.. ఓటుకు రూ.10 వేలు పంపిస్తే మీరు రూ.3 వేలు మాత్రమే ఇవ్వడం ఏంటని క్రింది స్థాయి నాయకులను ప్రశ్నించారు. ఇప్పటివరకు మీరు తిన్న డబ్బు సరిపోదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంకోచోట తాను ఓ పార్టీకి ఓటేస్తానని చెప్పిన మహిళ.. మరో పార్టీ ఇచ్చే డబ్బులు కచ్చితంగా ఇచ్చి తీరాలని డిమాండ్ చేసి మరీ తీసుకుంది. మునుగోడు మండలంలోని ఆ గ్రామంలోని 40 శాతం ఓటర్లకే డబ్బులు పంచింది ప్రధాన పార్టీ. మరో ప్రధాన పార్టీకి చెందిన గ్రామశాఖ అధ్యక్షుడి భార్య… ఆ పార్టీ తరఫున డబ్బు పంపిణీ చేస్తున్న నాయకుడితో గొడవకు దిగింది. తాను మాత్రం ఇదే పార్టీకి ఓటేస్తానని తనకు రూ.3 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేసి తీసుకుంది. ఇక నాయకులు కూడా మాట మార్చారు. డబ్బులిచ్చాకే ఓటేయడానికి రావాలని మొన్నటివరకు వలస ఓటర్లకు చెప్పిన వారు.. ఓటు వేస్తేనే డబ్బులిస్తామని చెబుతున్నారు.