Munugodu bjp triple R and November sentiment not realized
mictv telugu

బీజేపీ RRR, నవంబర్ సెంటిమెంట్లు గల్లంతు..

November 6, 2022

సెంటిమెంట్ అంటే సెంటిమెంటే.. అన్నిసార్లూ ఫలిస్తుందనే గ్యారెంటే లేదు. ఫలిస్తే మరింత గట్టి నమ్మకం. ఫలించకపోతే టైం బాగోలేదని సరిపెట్టుకోవడమే. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రస్తుత పరిస్థితి అదే. ఎన్నికల్లో తనకు బాగా కలిసొస్తాయని భావించిన రెండు సెంటిమెంట్లు ఈసారి ఎదురు తిరిగాయి. ఓటరు నాడి ముందు ఏ సెంటిమెంటూ పనిచేయదని అర్థమైంది.

మునుగోడు ఉప ఎన్నికల్లో తమకు ట్రిపుల్ ఆర్ సెంటిమెంటు కలసి వస్తుందని, గెలుపు తమదేనని బీజేపీ శ్రేణులు ప్రచారం చేసుకున్నాయి. ట్రిపుల్ ఆర్ అంటే రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్. 2018 ఎన్నికల్లో రాజాసింగ్ ఘోషా మహల్ నుంచి గెలిచి, అసెంబ్లీలో బీజేపీ ఉనికి నిలబెట్టారు. రఘునందన్ రావు 2020లో దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచారు. 2021లో హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ విజయ దుంధుభి మోగించారు. ముగ్గురి పేర్లూ ఆర్‌తో మొదలు కావడం, మునుగోడు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా ఆర్ అక్షరంతోనే మొదలు కావడంతో ఆర్ సెంటిమెంటు ఫలిస్తుందని కాషాయ శ్రేణులు భావించాయి.

ఆ సెంటిమెంటు పనిచేయకపోగా ‘నవంబర్ సెంటిమెంటు’ కూడా హ్యాండిచ్చింది. దుబ్బాక ఎన్నికల ఫలితాలు నవంబర్ 10న, హుజూరాబాద్ ఫలితాలు నవంబర్ 2న వచ్చాయి. మునుగోడు ఫలితాలు కూడా నవంబర్ 6నే వస్తున్నాయి కాబట్టి గెలుపు తమదేనని బీజేపీ కార్యకర్తలు చాలా ధీమాతో ఉన్నప్పటికీ ఓటర్లు నిర్ణయాలు వేరేలా ఉండడంతో ఆశలు నీరుగారాయి.