munugodu by poll campaign end
mictv telugu

మునుగోడులో మూగబోయిన మైక్‌లు..

November 1, 2022

munugodu by poll campaign end

నెల రోజులు పాటు హోరాహోరీగా సాగిన మునుగోడు ప్రచారానికి నేటితో తెర పడింది. రాజకీయ నేతలు ఎక్కడికక్కడే గప్ చప్ అయ్యారు. వారి మైక్ లు మూగబోయాయి. 6 గంటలకు ప్రచార సమయం ముగియడంతో ఈసీ ఆదేశాల మేరకు స్థానికేతరులు, రాజకీయ నేతలు మూటా ముళ్లే సర్దుకొని మునుగోడు విడిచి వెళ్లిపోయారు.ఇక సోషల్ మీడియాలోనూ ప్రచారం బంద్ అయ్యింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు వైన్స్ మూతపడనున్నాయి..

ఇక ప్రచారం చివరి రోజు కావడంతో మునుగోడు దద్దరిల్లింది. అలాగే పలివెలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ,టీఆర్ఎస్ అభ్యర్థులు బాహాబాహీకి దిగారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయి. మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు రోడ్ షోలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక కాంగ్రెస్ మహిళా గర్జన పేరుతో భారీ సభను ఏర్పాటు చేసింది. ఈ సభతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారానికి ఫైనల్ టచ్ ఇచ్చారు.

మొత్తానికి ప్రచారం బంద్ కావడంతో ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు. పార్టీలు ఎలాంటి ప్రలోభాలకు తెరలేపకుండా నిఘా పెట్టారు. డబ్బు, మద్యం పంపిణీ కాకుండా కఠిన చర్యలు చేపడుతున్నారు. 105 సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు. 100 చెక్ పోస్ట్‌ల ద్వారా విస్తృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. 45 ప్రత్యేక పోలీసు టీంలు,37 రెవిన్యూ టీంలు ప్రత్యేక విధులు నిర్వర్తిస్తున్నాయి. 2,41,000 వేల మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకునేలా మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1192 మంది సిబ్బంది అవసరం ఉండగా అదనంగా 300 మందిని నియమించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు కల్పించనున్నారు. పోలింగ్ నవంబర్ 3న జరగనుండగా.. నవంబర్ 6న కౌంటింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.