Munugodu bypoll political provocation and clash between trs and bjp
mictv telugu

రెచ్చగొడుతున్నదెవరు…రెచ్చిపోతున్నదెవరు?

November 1, 2022

రెచ్చగొడుతున్నదెవరు…రెచ్చిపోతున్నదెవరు? దాడుల వెనుక వ్యూహం ఉందా?టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల్ని అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం ఉందా? ఇప్పుడే ఇలా ఉంటే పోలింగ్ రోజు వరకు పరిస్థితి ఏంటి? మునుగోడు బై పోల్‌కు మరింత భద్రత పెంచాల్సిన అవసరం ఉందా? దాడులపై ఏ పార్టీ వాదనలో నిజమెంత?

దాడుల పరంపర

మునుగోడులో చివరిరోజు ప్రచారం రణరంగంగా మారింది. పోటాపోటీ ర్యాలీలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఎవరు ఎవరికి అడ్డుపడ్డారోగానీ దాడులు, పరస్సర దాడులతో రచ్చ రచ్చ జరిగింది. పలివెలలో బీజేపీ నేత ఈటల రాజేందర్ బైక్ ర్యాలీ చేశారు. అప్పుడే ఈ ర్యాలీకి ఎదురుగా టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. ముందుకు, వెనక్కు వెళ్లలేని పరిస్థితి. ఈ క్రమంలో టీఆర్ఎస్ , బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. మాటమాటపెరిగి దాడులదాకా వెళ్లింది. ఈటల రాజేందర్ కారుపైకి కొందరు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఈటల కాన్వాయ్‌లోని నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇరుపార్టీల కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. పోలీసుల జోక్యంతో చివరకు పరిస్థితి అదుపులోకి వచ్చింది.

పోలీసుల వైఫల్యమా?

పలివెలలో పరస్పర దాడుల్ని పోలీసులు ముందే అంచనా వేయలేకపోయారా? పోటాపోటా ర్యాలీలకు సరైన భద్రత కల్పించలేకపోయారా?అవుననే అంటున్నారు బీజేపీ నేతలు. నలుగురు పోలీసులు మాత్రమే అక్కడ ఉన్నారని చెబుతున్నారు. “పలివెల మా అత్తగారి ఊరు.కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి అల్లరి అల్లరి చేశారు. కావాలని పెద్దపెద్ద జెండా కర్రలు, రాళ్లు పట్టుకుని వచ్చారు. వాళ్లు మా పై దాడికి ప్రయత్నించారు. ఓఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇద్దరు జడ్పీచైర్మన్లు ప్లాన్ చేసి మరి దాడులకు తెగబడ్డారు. ఈ దాడులపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం.మునుగోడులో గెలిచేది బీజేపీ”అని ఈటల రాజేందర్ అన్నారు. అటు మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కూడా పోలీసులపై ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్‌కే పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని అన్నారు.

బీజేపీకి టీఆర్ఎస్ కౌంటర్

దాడులకు బీజేపీయే కారణమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఓడిపోతామనే భయంతోనే బీజేపీ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారని ఫైర్ అయ్యారు. పలివెల ఘటనలో పోలీసుల వైఫ్యలం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఈసీ సీరియస్

పలివెల ఘటనపై ఈసీ సీరియస్ అయింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించింది. అసలేం జరిగిందొ నివేదిక ఇవ్వాలని ఈసీ కోరింది. బలగాల్ని మరింత పెంచాలని పోలీస్ అధికారుల్ని ఆదేశించింది. పోలింగ్ ప్రశాంతంగా సాగేలా కేంద్రబలగాల్ని రంగంలోకి దించింది. అన్ని పోలింగ్ బూత్‌ దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీ ఆదేశించింది.

దాడుల వెనుక వ్యూహం ఉందా?

అసలు రెచ్చిగొట్టిందెవరు..రెచ్చిపోయిందెవరు?ఈదాడుల వెనుక వ్యూహం ఉందా?కొందరు కావాలనే ఆఖరిరోజు ఘర్షణలకు తెరలేపారా?అంటే ఇదంతా నిజం కాదని పోలీసులు చెబుతున్నారు.అనుకోకుండానే పలివెల ఘటన జరిగిందని అంటున్నారు.సయమనం పాటించాలని ఇరుపార్టీల కార్యకర్తలకు సూచించారు.