మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో జంపింగ్‌లు ఊపందుకున్నాయి. పెద్దా చిన్నా భేదాలు లేకుండా నేతలు ముందుజాగ్రత్త పడుతున్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గులాబీ గూటిని వదిలి కాషాయం గూటికి చేరుకోవడం తెలిసిందే. తాజాగా మునుగోడు కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
శనివారం ఆయన చండూరు ఎంపీపీ అయిన తన భార్య కల్యాణితో కలసి మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిపోయారు. కేటీఆర్ వారికి కండువా కప్పి ఆహ్వానం పలికారు. రవికుమార్ ప్రత్యేక ఉద్యమ కాలం నుంచి తమతో కలిసి పని చేశారని, ఇప్పుడు పార్టీ కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు. రవికుమార్‌కు టీఆర్ఎస్ మంచి అవకాశాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. బేషరతుగానే పార్టీలో చేరామని రవికుమార్ చెప్పారు. చండూరు ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని మంత్రిని కోరానని, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.