శిల్పా చక్రపాణి రెడ్డిపై కాల్పులు - MicTv.in - Telugu News
mictv telugu

శిల్పా చక్రపాణి రెడ్డిపై కాల్పులు

August 24, 2017

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత శిల్పా చక్రపాణి రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గురువారం ఆయనపై భూమా వర్గానికి చెందిన వ్యక్తులు కాల్పులు జరిపారు. అభిరుచి మధు అనే దుండగుడు ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే ఈ కాల్పుల నుంచి చక్రపాణి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. మైనారిటీ నేత చింపింగ్‌  అంత్యక్రియలకు హాజరైన శిల్పా చక్రపాణిరెడ్డిపై సూరజ్‌ గ్రౌండ్‌ హోటల్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. చక్రపాణిపై కాల్పులకు పాల్పడిన మధుపై రౌడీషీట్‌ ఉంది. ఎన్నికల సమయంలో మధుకు చంద్రబాబు సర్కార్‌ గన్ మెన్లను కూడా కేటాయించింది.

కాల్పులపై చక్రపాణి రెడ్డి స్పందించారు. ‘అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళితే అటకాయించారు. మా వాహనాలను ముందుకు వెనక్కి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇదేంటని మా వాళ్లు ప్రశ్నిస్తే.. మీ సంగతి చూస్తామన్నారు. మీ సంగతి తేల్చడానికే ఇక్కడికి వచ్చామని బెదిరించారు. వాళ్ల చేతుల్లో గన్‌లు ఉన్నాయి. కార్లలో వేట కొడవళ్లు ఉన్నాయి.

దాడి విషయాన్ని పోలీసులకు చెబితే తాత్సారం చేశారు. కొత్త సూరజ్ హోటల్‌ వద్ద దాడి జరిగిందని పోలీసులకు చెబితే పాత సూరజ్‌కు వెళ్లామని చెప్పారు. పోలీసులు నిదానంగా వచ్చి అందరిని పంపే ప్రయత్నం చేశారు. నిన్న మా కార్యకర్తలను కొట్టారు. నేడు నాపై దాడికి ప్రయత్నించారు. ఇలాంటి వాటికి మేం, మా కార్యకర్తలు భయపడేది లేదు’’ అని అన్నారు.

నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో చక్రపాణి రెడ్డి సోదరుడైన మోహన్ రెడ్డి గెలుస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో చక్రపాణిపై హత్యాయత్నం జరిగింది.