మర్డర్ సీన్.. యువకుడిని కాపాడిన బస్సు డ్రైవర్ - MicTv.in - Telugu News
mictv telugu

మర్డర్ సీన్.. యువకుడిని కాపాడిన బస్సు డ్రైవర్

May 10, 2019

కారు చేజింగులు, బస్ చేజింగులు మనం సినిమాల్లో చూస్తుంటాం. ఆ సన్నివేశాల్లో హీరో వెంటపడేవాళ్లల్లోనో, పరుగెత్తేవాళ్లలోనో వుంటాడు. ఇలాంటి దృశ్యాలు మనం నిజ జీవితంలో చూడము. ఓచోట బస్ చేజింగ్ సీన్ జరిగింది. ఈ సీన్‌లో హీరో ఎవరో కాదు బస్సు నడిపే డ్రైవరే. కొందరు అగంతకులు ఓ వ్యక్తిని దారుణంగా పొడిచి వెంబడించసాగారు. ఆ వ్యక్తి నడుస్తున్న బస్సును ఆపాడు. డ్రైవర్ బస్సును ఆపడంతో అందులో ఎక్కాడు. ఇంకే వెనకనుంచి వారు తరమసాగారు. బస్సు డ్రైవర్ వాళ్లకు చిక్కకుండా బస్సు వేగం పెంచాడు. అతన్ని సమయానికి ఆస్పత్రికి తీసుకువెళ్లి అతని ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన ఏపీలోని తిరుపతి రూరల్ మండలంలో చోటు చేసుకుంది.

తిరుచానూరు యోగిమల్లవరానికి చెందిన మదన్ కుమార్ అనే యువకుడు బైక్ పై వెళ్తుండగా ప్రత్యర్థులు కాపుకాసి రామానుజపల్లె చెక్‌పోస్ట్ వద్ద దాడికి దిగారు. అతన్ని విచక్షణా రహితంగా కత్తులతో పొడిచారు. దాదాపు 9 కత్తిపోట్లకు గురయ్యాడు. తీవ్ర గాయాలతో రక్తం ఓడుతోంది. వాళ్లలా కత్తులతో దాడి చేస్తూనే వున్నారు. మదన్ వాళ్లనుంచి తప్పించుకుని రోడ్డు మీద పరుగెత్తుతున్నాడు. ఇంతలో ఓ బస్సు కనిపించింది. సాయం అర్థిస్తూ దాని వెనకాల పరుగుపెట్టాడు. అతని పరిస్థితి అర్థంచేసుకున్న బస్సు డ్రైవర్ వెంటనే బస్సు ఆపి మదన్‌ను అందులో ఎక్కించుకున్నాడు.

Murder scene... The bus driver who saved the young man.

మదన్‌ను చంపేందుకు వచ్చిన ఆ దుండగులు బస్సును కూడా వెంటాడసాగారు. దీంతో డ్రైవర్ మరింత అప్రమత్తమై వారికి చిక్కకుండా బస్సు వేగం పెంచాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి మదన్‌ను ఆస్పత్రికి తరలించారు. సమయానికి అతన్ని ఆస్పత్రికి తీస్కెళ్లడంతో అతను బతికాడని వైద్యులు వెల్లడించారు. డ్రైవర్ చూపిన చొరవకు పోలీసులతో పాటు, బస్సులోని ప్రయాణికులు, వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. కాగా, గతంలో కార్వేటినగరంలో జరిగిన జంట హత్యల్లో మదన్ పాత్ర ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. జంట హత్యల నేపథ్యంలోనే ప్రత్యర్థులు మదన్‌ను చంపడానికి ప్రయత్నించారనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.