పుట్టగొడుగులతో కరోనాకు చెక్ పెట్టొచ్చు.. సీసీఎంబీ - MicTv.in - Telugu News
mictv telugu

పుట్టగొడుగులతో కరోనాకు చెక్ పెట్టొచ్చు.. సీసీఎంబీ

October 20, 2020

Nutrition

యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. దానికి విరుగుడు కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు శ్రమిస్తూనే ఉన్నారు. కొన్ని సంస్థలు ప్రయోగాలను చివరి దశకు తీసుకువచ్చాయి. మరికొన్ని నెలల్లోనే వ్యాక్సిన్ తెస్తామని ప్రకటిస్తున్నాయి. రష్యా అయితే ఏకంగా రెండు వ్యాక్సిన్లను సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఎన్నో రకాల ఉపశమన పద్దతులు తెరపైకి వచ్చాయి. పసుపు, అల్లం  కలిపిన నీటితో కషాయం తాగితే వ్యాధి రాకుండా చేయవచ్చని పలువురు చెబుతూ వచ్చారు. తాజాగా హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) మరో కీలక విషయాన్ని వెల్లడించింది. పుట్టగొడుగులతో కరోనాకు చెక్ పెట్టవచ్చని తెలిపింది. 

వైరస్‌ను అంతం చేసేందుకు పుట్టగొడుగులు సమర్ధవంతంగా పని చేస్తున్నాయని సీసీబీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు.దీనిపై తాము చేసిన పరిశోధన విజయవంతమైందని వెల్లడించారు. పుట్టగొడుగుల్లో మెండుగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా గ్లూకాన్స్,యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల ఇది సాధ్యమౌతుందని పేర్కొన్నారు. దీంతో మహమ్మారికి మంచి విరుగుడుగా పని చేస్తుందని అన్నారు. అటల్ ఇంక్యుబేషన్‌లోని స్టార్టప్ సంస్థ క్లోన్ డీల్స్, సీసీఎంబీతో కలిసి చేసిన పరిశోధనల్లో ఇది తేలిందన్నారు. 

ఆంబ్రోషియా ఫుడ్ ఫామ్‌తో కలిసి పుట్టగొడుగులతో చేసిన సప్లిమెంటుపై పరిశోధనలు జరిపింది. ఇవి సక్సెస్ కావడంతో కార్డిసెప్స్, కర్కమిన్‌తో కలిసి ద్రవ రూపంలో ఈ ఆహారాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు. పసుపు మిశ్రమంతో కలిసిన ఈ ఆహారం తీసుకుంటే ఊపిరితిత్తుల పనితీరును మరింత సమర్థవంతంగా పని చేస్తాయని చెప్పారు. దీనిపై ఇప్పటికే ఎయిమ్స్ నాగ్‌పూర్, భోపాల్ కేంద్రాల్లో  ప్రయోగాలు సాగుతున్నాయి. వచ్చే ఏడాది దీన్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతున్నారు. దీంతో భారత్‌లో తొలిసారి ఓ యాంటి వైరల్ ఔషద ఆహారం ప్రయోగాలు విజయవంతం కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తయారు అవుతున్న వ్యాక్సిన్లు ఒక్కో ఫలితాన్ని ఇస్తున్న సంగతి తెలిసిందే.