టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచె తండ్రి కన్నుమూశారు. ఆయన తండ్రి లక్ష్మీనారాయణరావు(90) మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్నీ రఘు కుంచెనే సోషల్ మీడియాలో షేర్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకి గతేడాది అంటే 2022 చాలా భారంగా గడిచింది. పలువురు ప్రముఖ నటీనటులు అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలతో మరణించారు. లెజండరీ నటులైన కృష్ణ, సత్యనారాయణలను ఇండస్ట్రీ కోల్పోయింది. అయితే ఇవన్నీ మరువక ముందే మళ్ళీ అలాంటి ఘటన ఒకటి రఘు ఇంట్లో జరిగింది. తూర్పు గోదావరిలోని కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో నివాసముంటున్న రఘు తండ్రి లక్ష్మీ నారాయణరావు వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారు.
అయితే లక్ష్మీ నారాయణరావుకి భార్య వరహాలమ్మ, కుమారుడు రఘు సహా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లక్ష్మీనారాయణరావు అంత్యక్రియలు బుధవారం ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి. అతను హోమియోపతిగా పనిచేశాడు. వ్యవసాయం కూడా జీవనాధారంగా జీవిస్తున్న లక్ష్మీనారాయణరావు స్థానిక సాగునీటి సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక పూరిజగన్నాథ్ చిత్రాలతో రఘు కుంచె టాలీవుడ్ లో క్రేజ్ దక్కించుకున్నాడు. బంపర్ ఆఫర్, దొంగాట, పలాస తదితర సినిమాలకు మ్యూజిక్ అందించిన రఘు ప్రస్తుతం డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడిగాను బిజీగా ఉన్నాడు.