పేరెట్టి పిలవరు.. రాగం తీసి రమ్మంటారు.. - MicTv.in - Telugu News
mictv telugu

పేరెట్టి పిలవరు.. రాగం తీసి రమ్మంటారు..

September 25, 2018

ఈ లోకంలో వింతలకు విడ్డూరాలకు కొదువ లేదు. ఒక చోట గౌరవంగా పరిగణించేదాన్ని మరో చోట అగౌరవంగా భావిస్తారు. ఈల వేయడంలో కుర్రాళ్లు ముందుంటారు. అమ్మాయి కనిపిస్తే చాలు కెవ్వుకేకలే కొందరికి. అయితే ఆ ఊరిలో మాత్రం అందరూ ఈలలేస్తారు. ఆడవాళ్లు, మగవాళ్లు, పిల్లాముతకా అందరూ విజల్ వేయాల్సిందే. లేకపోతే పనిజరగదు మరి. అంటే ఏదో వ్యవహారం ఉందని అపోహపడకండి.. కాస్త ఓపిగ్గా చదవండి.

ఆ వింత ఊరు మన దేశంలోనే ఉంది. మేఘాలయలోని కొంగోతోంగ్ గ్రామం అది. అక్కడ తల్లి తన కొడుకును ఈలేసే పిలుస్తుంది. తండ్రి తన కూతురిని ఈలేసే పిలుస్తాడు. అదో సంప్రదాయం అంతే. జస్ట్ ఈలంటే ఈలకాదు.. రాగం తీసి మరీ వేస్తారు. ఎందుకంటే జనాన్ని వారి పేర్లతో పిలవ కూడదు కాబట్టి. పుట్టిన ప్రతి బిడ్డకు తల్లి ఒక ఈల ట్యూన్ కడుతుంది. ఆ బిడ్డను ఈ ట్యూన్‌తోనే పిలుస్తుంది. పిల్లలకు థాంగ్ పీ, కాషీ అనే నానా పేర్లు కూడా ఉంటాయి కానీ పిలవడం మాత్రం ఈలతోనే. పిల్లలు కూడా దానికి అలవాటు పడిపోతారు. చుట్టుపక్కలున్నవారూ అంతే. ఆ ట్యూన్‌తోనే పిలుస్తారు. పిలుపు ఏకంగా అరనిమిషం పాటు సాగుతుంది. ఒకసారిగాని ట్యూన్ కట్టేస్తే చనిపోయేంత వరకు దానికి బదులివ్వాల్సిందే.