ట్విట్టర్ కొనుగోలులో మస్క్ మడత.. లేదంటే అదే ఫైనల్! - MicTv.in - Telugu News
mictv telugu

ట్విట్టర్ కొనుగోలులో మస్క్ మడత.. లేదంటే అదే ఫైనల్!

May 17, 2022

సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం చేసుకున్న ఎలాన్ మస్క్ తాజాగా మరో బాంబు పేల్చారు. ఒప్పందం ప్రకారం కుదుర్చుకున్న రేటు కాకుండా తగ్గించి కొంటానని పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఇందుకు ట్విట్టర్‌లోని ఫేక్ ఖాతాల సంఖ్యే కారణమని ఆయన భావిస్తున్నారు. వివరాలు.. ఒక్కో షేరుకు 54.20 డాలర్లతో మొత్తం 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని మస్క్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో సంస్థలో నకిలీ ఖాతాల సంఖ్య దాదాపు 229 మిలియన్లు (20 శాతం) ఉంటాయని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ఫేక్ ఖాతాల సంఖ్య 5 శాతానికి మించి ఉండవని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, మస్క్ ట్విట్టర్‌తో ఒప్పందం చేసుకున్న తర్వాత ఆసంస్థ షేర్ల ధరలు భారీగా పడిపోయాయి. దీంతో తక్కువ ధర అయినా చెల్లిస్తాడు లేదా ఒప్పందాన్ని రద్దు అయినా చేసుకుంటాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, నకిలీ ఖాతాల సంఖ్యపై స్పష్టత రాకపోవడంతో ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు మస్క్ శుక్రవారం ప్రకటించారు.

దీంతో షేరు ధర పడిపోయి సోమవారం నాటికి 8 శాతం నష్టంతో 37.39 డాలర్ల వద్ద నిలిచింది. మరోవైపు చైనా ప్రభావం గురించి కొందరు విశ్లేషిస్తున్నారు. ట్విట్టర్ ఒప్పందం ఖరారయ్యాక మస్క్ మాట్లాడుతూ.. వాక్ స్వాతంత్య్రానకిపెద్దపీట వేస్తానని, తన వ్యతిరేక వర్గానికి కూడా తగిన ప్రాధాన్యం ఇస్తానని చెప్పుకొచ్చాడు. దీంతో టెస్లా కార్ల తయారీ కేంద్రం ఉన్న చైనా కోపం తెచ్చుకుంటుంది. ఎందుకంటే హాంకాంగ్, తైవాన్ విషయంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరించే వారికి ట్విట్టర్ వేదికగా ఉండవద్దని చైనా ఆలోచన. ఒకవేళ మస్క్ ట్విట్టర్‌ను కొంటే షాంఘైలో ఉన్న టెస్లా తయారీ కేంద్రానికి ఇబ్బందులు తప్పవు. ఎలాన్ మస్క్ టెస్లానే తనకు ముఖ్యమనుకుంటే ట్విట్టర్ కొనుగోలును ఆపివేయాలి. ఈ రెండింట్లో మస్క్ ఏది ఎంచుకుంటాడో వేచి చూడాలి.