ప్రముఖ అంతర్జాతీయ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఏడుగురు పిల్లలకు తండ్రి అయిన ఎలాన్ మస్క్.. మరో ఇద్దరు పిల్లలకు తండ్రి అయినట్లు బిజినెస్ ఇన్ సైడర్ పత్రిక పేర్కొంది. అంటే ఎలాన్ మస్క్‌కు మొత్తం 9 మంది పిల్లలు. ”భూమిపై జనాభా పెరుగుతుంది. కానీ భూమి మాత్రం పెరగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది పిల్లలు ఉన్నా పారిశ్రామిక వేత్తని నేను ఒక్కడినే” అని తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి.
బిజినెస్ ఇన్ సైడర్ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం..”ఎలాన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్ కంపెనీలో పనిచేస్తున్న శివోన్ జిలితో గత ఏడాది ఆయన కవలలకు జన్మనిచ్చారు. ఇప్పటికే ఆయన మాజీ భార్య జస్టిన్ విల్సతో ఐదుగురు పిల్లలకు, కెనడా సింగర్ క్రైమ్స్తోనూ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. గత సంవత్సరం డిసెంబరులోనే మస్క్, రైమ్స్ కలిసి సరోగసే ద్వారా రెండో బిడ్డకు ఆహ్వానం పలికారు. ప్రస్తుతం వీరివురు దూరంగా ఉంటున్నారు. ఆయన పిల్లలకు ఆయన పేర్లలోని చివరి పదాన్ని పిల్లల పేర్లలో ఉండేలా మార్చేందుకు అనుమతించాలని కోరగా, కోర్టు ఆమోదం ఇచ్చింది” అని ప్రచురించింది. కానీ, ఈ వార్తలపై ఇటు మస్క్ గానీ, అటు జిలిస్ గానీ ఇంకా స్పందించలేదు.