హనుమంతుడి కోసం ముస్లిం సైతం..ఖరీదైన స్థలం దానం
మతాల పేరుతో కొందరు కొట్టుకు చస్తుంటే మరికొందరు మతసామరస్యానికి అండగా నిలుస్తున్నారు. ఓ ముస్లిం వ్యాపారి హిందువుల దేవుడైన హనుమంతుడి ఆలయం కోసం ఖరీదైన స్థలాన్ని విరాళంగా ఇచ్చాడు.
బెంగళూరులో లారీ ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తున్న హెచ్ఎంజీ బాషా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. వలగెరెపుర గ్రామంలోని హనుమాన్ దేవాలయం గురించి ఆయనకు తెలిసింది. గుడి చిన్నగా ఉండడంతో భక్తులు ప్రదక్షిణలు చేయడానికి వీలు కావడం లేదు. ఆలయ అభివృద్ధి కోసం 120 గజాల భూమి అవసరం. భక్తులు ఈ విషయాన్నిబాషాకు చెప్పారు. గుడిని పరిశీలించిన బాషా గుడి పక్కనే ఉన్న తన 180 గజాల స్థలాన్ని ఇస్తానని చెప్పి పెద్ద మనసు చాటుకున్నాడు. తన స్థలంలో ఆలయం ఉండడం తనకు గర్వకారణమని అన్నాడు. గ్రామస్తు మొదట ఆయన మాటలు నమ్మలేకపోయారు. బాషా గట్టిగా హామీ ఇవ్వడంతో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
బాషా గుడికోసం ఇచ్చిన స్థలం ఖరీదు 80 లక్షల రూపాయలు. ఆయన నిర్ణయాన్ని కొనియాడుతూ వలెగెరెపుర గ్రామస్తులు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో బాషా, ఆయన భార్య కూడా ఉన్నారు. మతాలు వేరైనా మనుషులంతా ఒకటేనని బాషా చెబుతున్నాడు. రాజకీయ నాయకులే హిందూ, ముస్లింల మధ్య తేడాలు చూస్తున్నారని, ఈ పరిస్థితి మారాలని అంటున్నాడు. దేశప్రజలంతా ఐకమత్యంతో ఉండాలని కోరుతున్నాడు.