జైశ్రీరాం.. ముస్లిం యువతి చేతిపై పచ్చబొట్టు  - MicTv.in - Telugu News
mictv telugu

జైశ్రీరాం.. ముస్లిం యువతి చేతిపై పచ్చబొట్టు 

August 4, 2020

Muslim girl got tattoo of “Shriram” on her arm, know the reason behind it!.

ఓ ముస్లిం యువతి తన చేతిపై ‘శ్రీరాం’ అని పచ్చబొట్టు పొడిపించుకుంది. హిందూ ముస్లిం సఖ్యతకు అద్దం పడుతున్న ఈ సంఘటన వారణాసిలో చోటు చేసుకుంది. వారణాసికి చెందిన ఆమె పేరు ఇక్రా ఖాన్. త‌న‌తో పాటే ఎంతోమంది ముస్లిం సోద‌రులు అయోధ్యలో శ్రీరాముని ఆలయ నిర్మాణం ప‌ట్ల సంతోషంగా ఉన్నారని ఇక్రా ఖాన్ వెల్లడించింది.  ‘ల‌క్ష‌లాది హిందువులు క‌ల‌లు క‌న్న శ్రీరాముని ఆల‌యం నిర్మించాల‌న్న కోరిక నాకు కూడా ఉంది. ఈ ఆనంద క్ష‌ణాల కోసం నేను ఎప్ప‌టినుంచో ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లకైనా అయోధ్యలో రాముని ఆల‌య నిర్మాణం జరుగబోతున్నందుకు నాకు చాలా  సంతోషంగా ఉంది. ఈ శుభవేన రామమందిర భూమిపూజకు ముందే నేను హిందూ – ముస్లిం సఖ్యత‌ను చాటిచెప్పేందుకే నా చేతిపై ఈ ‘శ్రీరాం’ అనే పచ్చబొట్టు వేయించుకున్నా. నేను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభిమానిని’ అని ఇక్రా ఖాన్ తెలిపింది. 

ఓ ముస్లిం అమ్మాయి వచ్చి తన చేతిపై ‘శ్రీరాం’ అని పచ్చబొట్టు వేయమని అడగటంతో తాను చాలా షాక్ అయ్యానని.. అదే సమయంలో చాలా ఆనందం కూడా వేసిందని ఆమెకు టాటూ వేసిన  ఆ షాపు యజమాని అశోక్ గోగియా చెప్పారు. తాను ఎన్నో ఏళ్లనుంచి వారణాసిలోని సిగ్రా నగరంలో టాటూ షాపు నడుపుతున్నానని చెప్పాడు. ఆగ‌స్టు 5 రామమందిరి భూమిపూజ లోపు శ్రీరాముని టాటూలు వేయించుకున్న వారికి ఉచితంగా టాటూలు వేస్తాన‌ని‌.. ఇక్రా ఖాన్ ప్రేర‌ణ‌తోనే తాను ఈ ఆఫ‌ర్ ప్ర‌క‌టించాన‌ని అశోక్ చెప్పాడు.

కాగా, పవిత్రమైన అయోధ్యలో రామాలయ నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చకచకా జరిగిపోతున్నాయి. కొన్ని గంటల్లోనే ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుకకు ముస్లింల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో హిందూ-ముస్లింల ఐక్య‌త‌కు అద్దం ప‌డుతూ ఇక్రా ఖాన్ ‘శ్రీరాం’ అని పచ్చబొట్టు వేయించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.