కర్ణాటకలో ఉద్రిక్తత సృష్టించిన హిజాబ్ వివాదం సద్దుమణిగేలా కనిపిస్తోంది. వేసవి సెలవుల అనంతరం పీయూ కళాశాలలు గురువారం నుంచి ప్రారంభమవగా, ముస్లిం విద్యార్ధినులు హిజాబ్ లేకుండానే కాలేజీకి వచ్చారు. ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా తొలిరోజు గడవడంతో విద్యాశాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూశాయని, కానీ తమ ప్రభుత్వం చొరవ కారణంగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. మైనార్టీలు ఉన్నతంగా రాణించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హైకోర్టు తీర్పును అందరూ గౌరవించాలని కోరారు. కాగా, హిజాబ్ వివాదం ప్రారంభమైన దక్షిణ కన్నడ, ఉడిపి ప్రాంతాలలో ఈ ఏడాది ముస్లిం విద్యార్ధినుల సంఖ్య పెరగడం ఆసక్తి రేపుతోంది. పలువురు ముస్లిం నేతల విజ్ఞప్తులను విద్యార్ధినుల తల్లిదండ్రులు ఆచరించారు. కనీసం ఈ ఏడాదైనా చదువు సక్రమంగా సాగేలా చూడాలని వారు కోరుకుంటున్నారు.