మైనర్ బాలిక పెళ్లి విషయంలో జార్ఖండ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 15 ఏళ్ల వయసున్న మైనర్ బాలిక ముస్లిం వర్గానికి చెందింది కాబట్టి మతాచారం ప్రకారం పెళ్లి చేసుకునేందుకు అర్హురాలేనని స్పష్టం చేసింది. ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకారం 15 అంతకంటే ఎక్కువ వయసున్న అమ్మాయిలకు పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఉందని ప్రస్తావించింది. పెళ్లికి వారి సంరక్షకులు, తల్లిదండ్రుల జోక్యం అనవసరమని వ్యాఖ్యానించింది. బీహార్ కి చెందిన 24 ఏళ్ల మహ్మద్ సోను జార్ఖండ్ లోని జుగ్ సలాయ్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని కేసు నమోదైంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పలీసులు మహ్మద్ సోనుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీన్ని సవాల్ చేస్తూ మహ్మద్ సోను హైకోర్టులో సవాల్ చేశాడు. అయితే విచారణ సందర్భంగా అమ్మాయి తండ్రి మాట మార్చేశాడు. తన కూతురికి మంచి వరుడు దొరికినందుకు అల్లాకు రుణపడి ఉంటానని, అవగాహన లేమి కారణంగా అల్లుడిపై ఫిర్యాదు చేశానని వివరించాడు. పెళ్లికి అంగీకారమేనని తెలపడంతో ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.