అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని హిందువులకు కేటాయిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎంపీఎల్బీ) నిర్ణయించింది. అయోధ్యలో మరో చోట మసీదు నిర్మాణం కోసం సుప్రీం ఆదేశంతో కేటాయించే 5 ఎకరాల భూమిని కూడా తమకు వద్దని బోర్డు తెలిపింది. రివ్యూ పిటిషన్పై తమకు ఆశలేదని, దాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చుతుందని పేర్కొంది. అయినా పిటిషన్ వేయడం తమ హక్కు అని స్పష్టం చేసింది.
తీర్పుపై బోర్డు సభ్యులు, బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ, ముస్లిం మత పెద్దలు, సంస్థలు ఈ రోజు లక్నో సమావేశమై చర్చించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా హాజరయ్యారు. తీర్పును పరిశీలించిన సమావేశం.. తీర్పు తమకు ఆమోదయోగ్యం కాదని, రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించింది. దీనిపై న్యాయవాదులతో మాట్లాడతామని జమాతే ఉలేమా ఎ హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ మీడియాకు తెలిపారు. సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ ఈ పిటిషన్ వ్యహారం చూస్తారని, వచ్చే నెల 9వ తేదీ దాఖలు చేస్తామని చెప్పారు. షరియా ప్రకారం మసీదు భూమి అల్లాకు చెందుతుందని, దాన్ని మరొకరికి ఇవ్వడం కుదరదని అన్నారు.