ముస్లింలు అక్కున చేర్చుకున్న హిందువులు  - MicTv.in - Telugu News
mictv telugu

ముస్లింలు అక్కున చేర్చుకున్న హిందువులు 

February 27, 2020

Hindu, Muslim

ఓవైపు సీఏఏకు వ్యతిరేకంగా, మద్దతుగా సాగుతున్న అల్లర్లతో ఢిల్లీ దద్దరిల్లుతోంది. మరోవైపు హిందూ ముస్లిం భాయిభాయి అనే నినాదాన్ని నిజం చేస్తూ మానవత్వం పరిమళించింది. ఢిల్లీలోని అశోక్ నగర్‌ ప్రాంతంలో అల్లరి మూకల దాడిలో నిరాశ్రయులైన కొందరు ముస్లింలకు పొరుగు ప్రాంతాలలోని హిందువులు తమ ఇళ్లలో ఆశ్రయం కల్పించారు. ఎన్నో ఏళ్లుగా తమతో కలిసి జీవిస్తున్న ముస్లింలను కాపాడుకోవడం మా బాధ్యత అంటున్నారు ఆ హిందూ సోదరులు. వాళ్లు నిరాశ్రయులు అయ్యారు ఇలాంటి సమయంలో వారికి అండగా నిలవడం తమ బాధ్యత అని ఐకమత్యాన్ని చాటుతున్నారు. ఈ అల్లర్లలో బాధితుడైన ఖుర్షీద్ ఆలం మీడియాతో మాట్లాడుతూ.. ‘వేయి మందికి పైగా ఉన్న ఓ అల్లరి మూక అశోక్ నగర్‌లో ఉన్న ఆరు ముస్లిం ఇళ్లను తగులబెట్టారు. ఈ దాడిలో ఎలాగో మా ప్రాణాలు కాపాడుకున్నాం. కళ్ల ముందు ఇల్లు కాలిపోయి రోడ్డు పాలయ్యాం.. ఇప్పుడెలా అనుకుంటున్న సమయంలో ఈ ప్రాంతంలోనే నివసిస్తున్న మా హిందూ సోదరులు మమ్మల్ని అన్నదమ్ముల్లా చేరదీశారు’ అని తెలిపారు. 

అలాగే ముస్లింలకు ఆశ్రయం ఇచ్చిన హిందువులలో ఒకరైన రాజేష్ ఖత్రీ మాట్లాడుతూ..  ‘గుర్తు పట్టడానికి వీలు లేకుండా ముఖాలకు మాస్కులు వేసుకుని అల్లర్లకు పాల్పడుతున్నారు. వాళ్ల చేతుల్లో ఇనుప రాడ్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని షాపులను వాళ్లు తగలబెట్టారు. మంటల్లో తగలబడిన షాపుల్లో కొన్ని హిందువులకు చెందినవి కూడా ఉన్నాయి. వాళ్లంతా వెళ్లిపోయాక ఈ ప్రాంతంలో నివసించే మేమంతా ఒకరికొకరు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. వాళ్లు ముస్లింలు అయితేనేం వాళ్లు కూడా మా సోదరులు, చాలా కాలంగా కలిసి ఇక్కడే మాతో ఉంటున్నారు. ఇటువంటి సమయంలో వాళ్లకి సహాయం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది’ అని రాజేష్ తెలిపారు.