సీఏఏతో మన దేశ ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదు - MicTv.in - Telugu News
mictv telugu

సీఏఏతో మన దేశ ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదు

January 16, 2020

bnbnh

బీజేపీతో చేతులు కలిపిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పౌరసత్వ సవరణ చట్టాన్ని  (సీఏఏ) సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పూర్తి మద్దతు పలికారు. విజయవాడలో బీజేపీ, జనసేన భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఏఏకు మతం రంగు పులిమి, అపోహలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. మన దేశంలోని మైనార్టీలు వివక్షకు గురి కావడం లేదని.. అందరూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇతర మతస్తులకు పౌరసత్వాన్ని కల్పించి, ముస్లింలకు మాత్రం అన్యాయం చేస్తున్నారంటూ రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. దేశ విభజన అనంతరం పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మార్పు చెందిందని… ఆ తర్వాత అక్కడున్న మైనార్టీలు ఊచకోతకు గురయ్యారని అన్నారు. కానీ, మనదేశం హిందూదేశంగా ప్రకటించుకోలేదని తెలిపారు. పాకిస్తాన్‌లో మైనార్టీలు ఎలాంటి అణచివేతకు గురవుతున్నారో పాకిస్తాన్ క్రికెటర్ డానిష్ కనేరియా కూడా ఇటీవల చాలా స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. 

అక్కడ మైనార్టీ క్రికెటరే ఇబ్బంది ఎదుర్కుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చని అన్నారు. ‘బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌లలో కూడా మైనార్టీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్లను కాపాడేది ఎవరు? ముస్లిం దేశాలైన ఆ మూడు దేశాల్లో ముస్లింలదే ఆధిపత్యం. అక్కడ వారికి ఎలాంటి సమస్యలు లేవు. కేవలం మైనార్టీలు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు. ఆ మూడు దేశాల్లో వివక్షను ఎదుర్కొంటూ, బిక్కుబిక్కుబంటూ బతుకుతున్న హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, పార్శీలు, జైనులు, బౌద్ధులను కాపాడాల్సింది భారతదేశమే. పాకిస్తాన్‌లోని మైనార్టీలకు సమస్యలు తలెత్తితే మనమే కాపాడాలని గాంధీ, నెహ్రూ చెప్పారు. వారు కోరుకున్నదాన్ని ప్రధాని మోదీ చేస్తున్నారు. సీఏఏతో మన దేశ ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదు’ అని పవన్ స్పష్టంచేశారు.