జామా మసీదు ముందు ముస్లింల నిరసన.. మా ప్రమేయం లేదన్న ఇమామ్ - MicTv.in - Telugu News
mictv telugu

జామా మసీదు ముందు ముస్లింల నిరసన.. మా ప్రమేయం లేదన్న ఇమామ్

June 10, 2022

ఇస్లాం మత స్థాపకులు మహమ్మద్ ప్రవక్త పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలంటూ ముస్లింలు నిరసన చేపట్టారు. శుక్రవారం ప్రార్ధనల అనంతరం ఢిల్లీలోని జామా మసీదు ముందు నిరసనలకు దిగారు. అలాగే యూపీలోని సహరన్ పూర్, కోల్‌కతాలోని మసీదులు, హైదరాబాదులోని మక్కా మసీదు ఎదుట ఆందోళన నిర్వహించారు. మక్కా మసీదు వద్ద పోలీసులు అలర్ట్ అయి వారిని నియంత్రించగా, ఢిల్లీ జామా మసీదు ఇమాం తాజా నిరసనలపై స్పందించారు. నిరసనలకు తాము ఎలాంటి పిలుపు ఇవ్వలేదని స్పష్టం చేశారు. చాలా మంది అలాంటి చర్యలకు పాల్పడదామని కోరినా తాము వారిని వారించామని వెల్లడించారు. నిరసనలు చేస్తున్న వ్యక్తులు ఎవరో తమకు తెలియదని, వారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అనుచరులు అనుకుంటున్నామని షాహీ ఇమామ్ తెలియజేశారు. వారి ఇష్టం వారిది, వారికి తాము మద్ధతు ఇవ్వదలచుకోలేదని తేల్చి చెప్పారు.