ఆఫీసుకు వెళ్లాలో వద్దో ఆరోగ్య సేతు స్టేటస్ చెప్పేస్తుంది..
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం 'ఆరోగ్య సేతు' అనే మొబైల్ అప్లికేషన్ ను లాంచ్ చేసిన సంగతి తెల్సిందే. దీనిని స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు వినియోగించాలని ప్రభుత్వం కోరింది. దీంతో ఈ యాప్ ను కొన్ని కోట్ల మంది భారతీయులు తమ మొబైల్ ఫోన్ లలో ఇంస్టాల్ చేసుకున్నారు.
తాజాగా ఆరోగ్య సేతు యాప్‌ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా వినియోగించేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఈ మేరకు బుధవారం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆఫీస్‌కు బయలుదేరే ముందు ఆరోగ్య సేతు యాప్ లో తమ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలి. యాప్‌లో ‘సేఫ్’ లేదా ‘లో రిస్క్’ అని చూపెడితేనే ఆఫీస్‌కు రావాలని సూచించింది. యాప్‌లో ‘మోడరేట్’ లేదా ‘హై రిస్క్’ అని స్టేటస్ చూపెడితే ఆఫీస్‌కు రానవసరం లేదని తెలిపింది. ‘మోడరేట్’ లేదా ‘హై రిస్క్’ అని స్టేటస్ చూపెడితే 14 రోజులు ఇంటివద్దే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించింది.