మటన్ బిర్యానీ ప్రేమికులందరికీ శుభవార్త. టేస్టీ.. నిజామీ రుచికరమైన వంటకాలు టేస్టీ చేయాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ లో ప్రభుత్వం మటన్ క్యాంటీన్లను తెరవనుంది. వచ్చే నెలలో క్యాంటీన్లు ప్రారంభమవనున్నాయి. మీరు నాన్ వెజ్ ప్రియులా? మీకోసం హైదరాబాద్ మత్స్య భవన్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో చేపల క్యాంటీన్ ల తరహాలో ఈ మటన్ క్యాంటీన్ లను రూపొందించనున్నారు. రుచికరమైన వంటకాలు అందుబాటు ధరలో లభిస్తాయని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మటన్ క్యాంటీన్ లను ప్రారంభం కానున్నాయి.
మెనూ గురించి..
మటన్ బిర్యానీ, పాయా, గుర్దా ఫ్రై, పత్తర్ కా గోష్, ఖీమా వంటి మటన్ వంటకాలను అందించే ఈ మటన్ క్యాంటీన్ లలో మొదటిది శాంతినగర్ కాలనీలోని ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేయబడుతుంది. మెనూ, ధరలు ఇంకా ఖరారు కానప్పటికీ, సరసమైన ధరలకు పరిమితమైన వంటకాలతో వీటిని రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తే మోనూని మరింత విస్తరింప చేసే ఆలోచనలో ఉన్నారని అధికారులు అంటున్నారు.
అన్నిజిల్లా కేంద్రాల్లో..
నాణ్యమైన, తాజా మాంసం వినియోగదారులకు అందేలా చూడడానికి అధికారులు చెంగిచెర్లలోని ప్రభుత్వ కబేళా నుంచి మటన్ ను కొనుగోలు చేస్తారు. ఫెడరేషన్ ఇప్పటికే ఒప్పంద పద్ధతిలో చెఫ్ లను నియమించుకుంది. ‘ఫిష్ క్యాంటీన్ల విజయాన్ని చూసిన తర్వాత, మేం మటన్ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నం. పాకెట్ ఫ్రెండ్లీగా ఉండే మటన్ వంటకాలను కూడా ప్రచారం చేయాలనే ఆలోచన ఉంది’ అని ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు. వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా హైదరాబాద్ అంతటా, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మటన్ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు బాలరాజు యాదవ్ అన్నారు.