నన్ను దత్తపుత్రుడు అంటే నిన్ను ఆ మాట అనాల్సి వస్తుంది.. జగన్‌కు పవన్ వార్నింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను దత్తపుత్రుడు అంటే నిన్ను ఆ మాట అనాల్సి వస్తుంది.. జగన్‌కు పవన్ వార్నింగ్

April 12, 2022

 

 

ppppp

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ జగన్ మోహన్ రెడ్డిపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించేందుకు పవన్ మంగళవారం ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. ”చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మేం ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నాం. కానీ, మీరు నన్ను సీబీఎన్ (చంద్రబాబునాయుడు)కు దత్తపుత్రుడు అంటున్నారు. ఈ అనంతపురం నుంచే వైసీపీ అగ్రనాయకత్వానికి చెబుతున్నా, ఇంకొక్కసారి గనుక నన్ను వాళ్లకు, వీళ్లకు దత్తపుత్రుడు అంటే జగన్‌ను సీబీఐకి దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది. వాళ్ల పార్టీలోని చాలామంది ముఖ్య నాయకులను సీబీఐ దత్తత తీసుకుంటోంది. ఆ విషయం మర్చిపోవద్దు.

 

2019 సార్వత్రిక ఎన్నికల నుంచి మీరు జనసేన పార్టీని టీడీపీకి ‘బీ-టీమ్’ అంటున్నారు. దీనిపై ఏదన్నా గట్టిగా మాట్లాడితే మీరు ఏడుస్తారని ఊరుకున్నా. ఇక, నాకు కూడా సహనం పోయింది. ఇకపై మమ్మల్ని గనుక ‘బీ-టీమ్’ అన్నారంటే మిమ్మల్ని ‘చర్లపల్లి జైల్ షటిల్ టీమ్’ అనాల్సి వస్తుంది. చర్లపల్లి జైల్లో చక్కగా 16 నెలలు షటిల్ ఆట ఆడుకున్నారు. మీరేమీ దేశ సేవ చేయలేదు. మీరేమీ సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్ లు కాదు. మీరు ఆర్థిక నేరాలకు పాల్పడి జైల్లో కూర్చున్నవాళ్లు. మీరు మాకు నీతులు చెప్పకండి. మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదు. అసలు ఆ స్థాయి కూడా లేదు మీకు” అంటూ పవన్ ఘాటుగా విమర్శించారు.