డాక్టర్ల సమ్మె పంతం.. పసికందు ప్రాణం బలి - MicTv.in - Telugu News
mictv telugu

డాక్టర్ల సమ్మె పంతం.. పసికందు ప్రాణం బలి

June 14, 2019

‘My bad luck’ Bengal man blames doctors’ strike for death of his newborn

డాక్టర్ల సమ్మె కారణంగా ఓ పసిబిడ్డ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఫోటోలో కనిపిస్తున్న తండ్రి చనిపోయిన తన బిడ్డను ఎత్తుకుని బోరుమని ఏడ్వటం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. జూనియర్‌ వైద్యులపై దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మె చేస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లోని ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీలో కూడా వైద్యులు సమ్మెలో వుండటంతో.. వైద్యం అందించే నాథుడు లేక చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి బెంగాల్‌ వాసి.

రెండు రోజుల క్రితం అతని భార్య బిడ్డకు జన్మినిచ్చింది. కానీ పసికందు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. దీంతో బిడ్డను ఎత్తుకుని వైద్యుల వద్దకు పురుగెత్తారు. తాము సమ్మెలో వున్నామని, వైద్యం చేయమని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో ఆ బిడ్డకు అప్పుడే నూరేళ్లు నిండాయి. చూస్తూ చూస్తూ బిడ్డ ప్రాణాన్ని కాపాడుకోలేకపోయానని ఆ నిస్సహాయ తండ్రి బిడ్డ మృతదేహాన్ని ఎత్తుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఆ సమయంలో బెంగాల్‌కు చెందిన ఓ ఫొటోగ్రాఫర్‌ ఈ ఫొటోను తీశారు. వైద్యుల సమ్మె ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఫొటోనే నిదర్శనం అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. నెటిజన్లు వైద్యుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. సమ్మె ఓ సమస్యను పరిష్కరించాలి కానీ, ఇలా కుటుంబాల్లో విషాదాన్ని నింపొద్దని అంటున్నారు.

వైద్యులపై దాడిని నిరసిస్తూ సమ్మె..  

ఎన్‌ఆర్‌ఎస్‌ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న ఓ రోగి సోమవారం రాత్రి చనిపోయాడు. దీంతో అతని చావుకు కారణం వైద్యులే అని ఆరోపిస్తూ మృతుని బంధువులు ఆస్పత్రి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు జూనియర్‌ వైద్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని నిరసిస్తూ బెంగాల్‌లోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులతో పాటు కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోని జూనియర్‌ వైద్యులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఆస్పత్రుల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. వైద్యులు త్వరగా సమ్మె విరమించాలని.. లేకపోతే ఇంకా ఎన్ని చావులు చూడాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.