మా నాన్న హీరో.. ఆయనది వీర మరణం ! - MicTv.in - Telugu News
mictv telugu

మా నాన్న హీరో.. ఆయనది వీర మరణం !

August 16, 2017

ఈ వార్త వింటే మీ హృదయాలు కూడా ద్రవిస్తాయి. భారత సైన్యంలో కమెండోగా చేస్తున్న ప్రమోద్ కుమార్ గత సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజే నౌహట్టా ( జమ్మూ కాశ్మర్ ) లో వీర మరణం పొందాడు. తీవ్రవాదులతో హోరాహోరీ యుద్ధం చేస్తూ శత్రువు నుండి దూసుకొచ్చిన గుండుకు తన గుండెను అడ్డుపెట్టి బలయ్యాడు. అయితే ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆ వీర సైనికుడి ఆరేళ్ళ కూతురు అరణ్య, తండ్రి అమరుడు అయిన చోటే జెండాను ఎగురవేసింది. పాపతో తల్లి నేహా కూడా హాజరైంది. RPF క్యాంపు సహాయంతో తండ్రి అమరుడైన చోటుకు వెళ్ళి తిరంగాను ఎగురవేసి తన తండ్రితో తనకున్న జ్ఞాపకాలను ఆ పాప గుర్తు చేస్కుంది.

‘ మా నాన్న హీరో. దేశ రక్షణకై తన ప్రాణాలను అర్పించిన నాన్న కన్నా నాకు వేరే ఎవ్వరూ ఆదర్శం కాదు. నాన్న మాతో లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి మాత్రం మాతోనే వుంది. అమ్మా – నేను నిత్యం నాన్నను తలుచుకుంటూ బాధపడినా, నాన్న వదిలి వెళ్లిన ఆదర్శాలను మాత్రం మరిచిపోము. తప్పకుండా నేను నాన్న చూపిన మార్గంలోనే నడుస్తాడు. ఈ దేశం కోసం పని చేస్తానని ’ ఆ పాప తన చిట్టి పొట్టి మాటలతో మాట్లాడింది. అక్కడున్నవాళ్ళందరి కళ్ళు ఛెమ్మగిల్లాయి.

తండ్రిలా తను కూడా హీరోను అయి, తీవ్రవాదుల అంతు చూస్తానని చెప్పిన పాప మాటలు అక్కడి సైనికుల హృదయాలను ద్రవింపజేసాయి. తర్వాత తండ్రి ఫోటోకు సెల్యూట్ చేసింది. ప్రమోద్ మిత్రుడు రాజేష్ యాదవ్ మాట్లాడుతూ ‘ అరణ్యలో నాకు నా ప్రాణ స్నేహితుడు ప్రమోదే కన్పిస్తున్నాడు. అతని పట్టుదల, దేశభక్తి అరణ్యలో పుష్కలంగా కనిపిస్తోందని ’ చెప్పాడు.

చూసారా మామూలు మనిషికి, ఒక వీర సైనికుడి మరణానికి గల తేడాను. ఒక సెలెబ్రెటీ చనిపోయినా ఎవరిలో అంతగా స్ఫూర్తిని నింపడేమో ? అక్కడ బార్డర్ లో సైనికుడు నిద్రాహారాలు మాని దేశ రక్షణ కోసం పోరాడుతున్నాడు కాబట్టే ఇక్కడ సెలెబ్రెటీ లైఫ్ అయినా, సామాన్యుడి లైఫ్ అయినా వెలిగేది. దేశం కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్న వీర జవానులు అమరులే. తండ్రిలా తను కూడా రేపు దేశం కోసం పోరాడాలనుకుంటున్న అరణ్యకు హ్యాట్సాఫ్ చెబుదామా. ఇంత మంచి కూతురుని దేశానికి కానుకగా ఇచ్చి అమరుడైన ఆ జవాన్ కు జైహింద్ అంటూ సెల్యూట్ చేద్దామా.