నిత్యానంద ఆశ్రమంలో నా కూతుర్ని చంపేశారు.. ఓ తల్లి ఆవేదన  - MicTv.in - Telugu News
mictv telugu

నిత్యానంద ఆశ్రమంలో నా కూతుర్ని చంపేశారు.. ఓ తల్లి ఆవేదన 

November 27, 2019

My daughter was, I've lost everything A Nithyananda disciple's mother recalls her ordeal

ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ఆశ్రమంలో మరో అకృత్యం వెలుగుచూసింది. బాలికల మాయం ఘటన గురించి మరిచిపోక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. 2014లో నిత్యానంద ఆశ్రమంలో తన కుమార్తెను హింసించి, దారుణంగా హత్య చేశారని ఝాన్సీ రాణి అనే మహిళ మీడియా ముందు వెల్లడించారు. తన బిడ్డను, భర్తను కోల్పోయానని.. కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయిందని చెప్పారు. తనలాంటి దుస్థితి మరెవ్వరికీ రాకూడదు.. దీనిపై సమగ్ర విచారణ జరిపించి, తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

ఈ నేపథ్యంలో ఇండియా టుడే టీవీ తెలిపిన కథనం ప్రకారం.. నిత్యానంద బెంగళూరు ఆశ్రమంలో తన కుమార్తె సంగీత అర్జున్‌ను  అక్రమంగా బంధించి, హత్య చేశారని ఝాన్సీరాణి ఆరోపించారని పేర్కొంది. 2008 – 2014 మధ్య కాలంలో త్రిచికి చెందిన సంగీత అర్జునన్ నిత్యానంద ఆశ్రమంలో కంప్యూటర్ విభాగానికి హెడ్‌గా పనిచేసేది. 28 డిసెంబర్ 2014లో ఆమె మరణించింది. అప్పుడు ఆమె వయసు 24 ఏళ్లు. ఆశ్రమంలో సంగీత చాలా దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తోందని తెలిసి ఆమెను ఇంటికి తీసుకువచ్చానని.. అయితే వెంటనే నలుగురు వ్యక్తులు వచ్చి బలవంతంగా సంగీతను తీసుకెళ్లారని ఆమె చెప్పారు. పైగా ఆశ్రమం నుంచి సంగీతను ఎత్తుకొచ్చావంటూ తనమీదే కేసు పెడతామని బెదిరించారని ఆమె తెలిపారు. అనంతరం తన బిడ్డను మళ్లీ సజీవంగా చూడలేకపోయానని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. 

ఆశ్రమంలో ఉండే హంసానంద, ప్రణయానంద ఇద్దరూ కనీసం తన కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడటానికి కూడా అనుమతించలేదని రాణి వాపోయారు. చాలాసార్లు ఆశ్రమానికి సంగీతను కలవడానికి వెళ్లి…గంటల తరబడి గేటు ముందు వేచి చూసేదాన్ని.. అయినా ఫలితం లేదు. చివరకు సంగీత గుండెపోటుతో చనిపోయిందని మృతదేహాన్ని అప్పగించారని తెలిపారు. ఇది కచ్చితంగా హత్యే.. తన బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆమె కోరారు. 

సంగీత అంత్యక్రియలు కూడా ఆశ్రమంలోనే చేయాలని చెప్పారని.. కానీ అందుకు తాను ఒప్పుకోలేదని.. తన కుమార్తె మృతదేహాన్ని ఇంటికి తీసుకురావాలని పట్టుబట్టాను. దీంతో మొదటి పోస్ట్‌మార్టం జరిగిందని ఆమె పేర్కొన్నారు. సంగీత మృతదేహంపై కాళ్లపై వాపు, రక్తపు మరకలను బంధువులు గమనించడంతో బెంగళూరులోని రాంగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయడంతో పాటు, రెండవసారి పోస్ట్‌మార్టం కోసం పట్టుబట్టినట్టు ఆమె తెలిపారు. దీంతో ఆమె శరీరంలోని అవయవాలన్నీ మాయమయ్యాయని రెండవ పోస్ట్‌మార్టం నివేదిక తేల్చింది. అయితే మొదటి శవపరీక్షలో వాటిని తొలగించినట్టు గత ఏడాది హైకోర్టు జడ్జికి తెలిపారన్నారు. కర్ణాటక కోర్టులో కేసు వేసి ఐదేళ్ళు అయ్యింది. గత ఏడాది ఈ కేసులో సీబీఐకి అప్పగిస్తున్నట్టు చెప్పారు. కానీ ఆ తరువాత పదిరోజుల్లోనే ఆ సదరు న్యాయమూర్తి బదిలీ అయ్యారు. కాగా, ప్రస్తుతం నిత్యానంద దేశం విడిచి వెళ్లిపోయారని పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే.