'My death certificate is gone' is a viral paper ad
mictv telugu

‘నా డెత్ సర్టిఫికెట్ పోయింది’ వైరల్ అవుతున్న పేపర్ ప్రకటన

September 23, 2022

ఎవరైనా ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత మరణ ధృవీకరణ పత్రం జారీ చేస్తారు. దాని ఆధారంగా మరణానంతర ప్రయోజనాలను ఆ వ్యక్తి కుటుంబం పొందగలుగుతుంది. అయితే విచిత్రంగా ఓ వ్యక్తి బ్రతికే ఉండి తన మరణ ధృవీకరణ పత్రం పోయిందంటూ న్యూస్ పేపర్‌లో ప్రకటన ఇచ్చాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అస్సాంకు చెందిన రంజిత్ కుమార్ ఈ నెల 7 వ తేదీన ఉదయం పది గంటలకు నాగాన్‌లోని లుమ్డింగ్ బజార్ వద్ద తన డెత్ సర్టిఫికెట్ పోగొట్టుకున్నట్టు ప్రకటన ఇచ్చాడు. అందులో సర్టిఫికెట్ నంబరు కూడా ఇచ్చాడు. ఈ ప్రకటన క్లిప్పింగ్‌ని ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ‘ఎవరికైనా దొరికితే తొందరగా ఇచ్చేయండి. లేకపోతే ఆ దెయ్యానికి కోపం వస్తుంది’ అని ‘ఒకవేళ దొరికితే ఎక్కడికి పంపాలి. స్వర్గానికా? లేక నరకానికా? అంటూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఒక వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ పోగొట్టుకోవడం ఇదే తొలిసారని మరొకరు చమత్కరించారు. ఇంతకీ ఆ వ్యక్తి బతికే ఉన్నాడా? లేదా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ బతికే ఉంటే డెత్ సర్టిఫికెట్ ఎలా జారీ అవుతుందని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.