బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తనకు రాజకీయంగా ఏ పదవి చేపట్టాలని ఉన్నదో మీడియా ముందు వెల్లడించారు. యూపీలో తనపై, తన పార్టీపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. గురువారం మాయావతి మీడియాతో మాట్లాడుతూ..” నేను అంబేద్కర్, కాన్షీరాం బాటలోనే నడవాలని అనుకుంటున్నా. దళితులు, అణగారిన వర్గాలు, ముస్లింలు తిరిగి బీఎస్పీకి ప్రాణం పోస్తే, యూపీ సీఎం, ప్రధాని అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. నేను సుఖవంతమైన జీవితాన్ని కోరుకోవడం లేదు. నాకు దేశ ప్రధాని కావాలని ఉంది. రాష్ట్రపతి కావాలనే కోరిక అసలు లేదు” అని ఆమె అన్నారు.
ఇటీవలే మాయవతిపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ‘మాయావతి రాష్ట్రపతి అవుతుందేమో’ అంటూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్‌పై మాయవతి తీవ్రంగా మండిపడుతూ.. ‘నాపై అఖిలేశ్ యాదవ్ ప్రతిరోజు పుకార్లు పుట్టిస్తున్నాడు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఓట్లను మాయావతి, బీజేపీకి ఇచ్చేసిందని ఆరోపిస్తున్నాడు’ అని అన్నారు.
మరోపక్క మాయవతి సన్నిహితురాలు, బీఎస్పీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్రా, ఆ పార్టీ ఏకైక యూపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ సింగ్‌లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిశారు. పలు విషయాలపై చర్చించారు. అనంతరం మాయావతి మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించడంతో యూపీ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.