అమెరికానే టార్గెట్.. ‘ప్రెజర్ కుక్కర్’ టీజర్.. - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికానే టార్గెట్.. ‘ప్రెజర్ కుక్కర్’ టీజర్..

October 29, 2019

ఉన్నత చదువులు, విదేశాల్లో భవిష్యత్తు, తల్లిదండ్రుల ఒత్తిడి వంటి యువత చుట్టూ అల్లుకున్న అంశాలతో తెరకెక్కిన చిత్రం ‘ప్రెజర్ కుక్కర్’. సాయి రోనక్ హీరోగా, ప్రీతి అస్రానీ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సుజయ్, సుశీల్ దర్శకత్వం వహించారు. రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి ముఖ్యపాత్రల్లో నటించారు. యువతకు మంచి సందేశం ఇచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శక నిర్మాతలు అంటున్నారు. ఎన్నో అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు తరుణ్ భాస్కర్ కట్ చేశారు. దాన్ని చిత్ర బృందం మంగళవారం విడుదల చేసింది. 

అమెరికాలో ఎందుకు చదవాలి అనుకుంటున్నావు? అని అడిగితే అది నా తండ్రి డ్రీమ్ అని హీరో చెబుతున్న డైలాగ్‌తో టీజర్ మొదలు అవుతుంది. ప్రపంచ పటంలో ఉన్న దేశాల పేర్లు చెప్పమంటే ఆ పిల్లవాడు అమెరికా, ఆస్ట్రేలియా వంటి వివిద దేశాల పేర్లే చెబుతాడు. పిల్లాడికి అతని తండ్రి విదేశాల్లో ఉంటున్న తన బంధువులను పరిచయం చేయడం ఆలోచింపజేస్తుంది. ఇలా ప్రతీ ఇంట్లో ఇప్పుడు యువతపై అమెరికా పిచ్చి రుద్దుతున్న తీరును ఈ చిత్రంలో చూపనున్నారని తెలుస్తోంది. అభిషేక్ పిక్చర్స్ సమర్పణలో కారంపూరి క్రియేషన్స్, మైక్ మూవీస్ పతాకాల కలయికలో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి  అన్నపరెడ్డి అప్పిరెడ్డి, సుజోయ్, సుశీల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.