నా తల్లి తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత అని, నా తండ్రి శోభన్ బాబే అంటూ ఓ మహిళ మదురై తహసీల్దార్ కార్యాలయంలో వాగ్వాదానికి దిగడం కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జయలలిత వారసురాలిని తానేనంటూ, తనకు వారసత్వ ధృవీకరణ పత్రం అందించాలని మదురై తిరువళ్లువర్ నగర్‌కు చెందిన మురుగేశన్ భార్య మీనాక్షి(38) డిమాండ్ చేసింది. అంతేకాకుండా ‘నా తండ్రి శోభన్ బాబు, నా తల్లి జయలలిత అని, చెన్నై పోయెస్ గార్డెన్లో ఉన్న నా తల్లి మరణించినందున, నాకు వారసత్వ సర్టిఫికేట్ ఇవ్వాలి అని జనవరి 27న ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా’ అని తెలిపింది.
దీంతో కార్యాలయ అధికారులు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధంకాక తికమక పడ్డారు. దరఖాస్తు చేసుకుని నెల దాటడంతో మంగళవారం మీనాక్షి కార్యాలయానికి వచ్చి, డిప్యూటీ తహసీల్దారు వద్ద వారసత్వ సర్టిఫికేట్ ఇవ్వాలని కోరింది. జయలలిత చెన్నైలో మరణించడంతో అక్కడికెళ్లి తీసుకోమని చెప్పారు. ఇందుకు మీనాక్షి నిరాకరించింది. తన తల్లిదండ్రులు తనను అనాధగా వదిలి వెళ్లారని, పళనిలో బంగారు రథం లాగే హక్కు తన తండ్రి శోభన్ బాబు తనకు ఇచ్చారని, దానికి సంబంధించిన పత్రాలు పొందానని, అయితే, వారసత్వ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వటం లేదని వాగ్వాదానికి దిగింది.
అనంతరం అధికారులు మీ హక్కుల విషయంలో న్యాయస్థానానికి వెళ్లి చూసుకోండి అంటూ మీనాక్షిని అక్కడ నుంచి పంపించేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… ”తన చిన్నతనంలోనే తన తల్లి తనను దూరం చేసుకుంది. బామ్మ పర్యవేక్షణలో పెరిగాను. నేనే జయలలిత నిజమైన వారసురాలి” అని తెలిపింది. కోర్టుకు వెళ్లటం గురించి న్యాయవాదితో మాట్లాడతానని తెలిపింది. మీనాక్షి భర్త మురుగేశన్ కూలీ కార్మికుడు కావటం గమనార్హం. గతంలో ఇలాగే ఇద్దరు జయలలిత వారసులమని కలకలం రేపిన విషయం తెలిసిందే.