Myanmar army helicopters fire on school, killing six children
mictv telugu

స్కూల్‌పై ఆర్మీ కాల్పులు.. ఏడుగురు చిన్నారుల మృతి

September 20, 2022

దారుణం.. అమానుషం.. ఘోరం.. సైనికులై ఉండి అభం శుభం ఎరుగని చిన్నారులని బలి తీసుకున్నారు. స్కూల్ లో రెబల్స్ నక్కి ఉన్నారని అనుమానంతో సైనిక హెలికాప్టర్లు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి ఏడుగురు చిన్నారులను పొట్టన పెట్టుకుంది మ‌య‌న్మార్‌లోని జుంటా సైన్యం. ఆ దేశంలోని సాగింగ్‌ ప్రాంతంలోని లెట్‌యట్‌కోనే అనే గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు చనిపోగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పీపుల్స్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ గ్రూపునకు చెందిన రెబల్స్.. లెట్‌యట్‌కోనే గ్రామంలోని బౌద్ధమఠాన్ని ఆధారంగా చేసుకొని ఆయుధ రవాణా చేస్తున్నారని సైన్యం ఆరోపించింది. ఇక్కడ తనిఖీలకు వచ్చిన సైనిక హెలికాప్టర్లపై ఆ రెబల్స్ దాడి చేశారని.. అందుకు ప్రతిదాడిగా కాల్పులు జరిపామని చెబుతోంది. ఈ ఘటనలో కొందరు పిల్లలు అక్కడికక్కడే చనిపోయారు. వీరి మృతదేహాలను సైన్యం అక్కడి నుంచి 11 కిలోమీటర్ల దూరంలోని ఓ టౌన్‌షిప్‌నకు తీసుకెళ్లి పూడ్చిపెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. కాల్పుల కారణంగా తూట్లు పడిన పాఠశాల భవనం చిత్రాలు సోషల్‌ మీడియాలో కనిపించాయి. మయన్మార్‌ సైన్యం ఉద్దేశపూర్వకంగానే పాఠశాలలను లక్ష్యంగా చేసుకుంటోందని ‘నేషనల్‌ యూనిటీ గవర్నమెంట్‌’ అనే సంస్థ ఆరోపించింది.