భారతీయ టెకీలను బంధించి సైబర్ నేరస్థులుగా మార్చిన మయన్మార్
సాఫ్ట్ వేర్ రంగంలో భారతీయుల ప్రతిభ జగద్విదితమే. ప్రపంచ దిగ్గజ కంపెనీలకు మనవాళ్లు సీఈవోలుగా రాణిస్తున్నారు. సరిగ్గా ఈ పాయింటుని పట్టుకున్న మయన్మార్‌కు చెందిన ఓ ముఠా ఉద్యోగాల పేరుతో భారతీయ టెకీలకు వల వేసింది. వారిని కిడ్నాప్ చేసి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఈ నేరాల వెనుక ఇంటర్ పోల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న చైనా వ్యాపార వేత్త షీ జిజాంగ్ ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మయన్మార్‌లో ఇతనికి చెందిన మైవడీ ప్రాంతంలో 300 మంది భారతీయులు బందీలుగా ఉండగా, అందులో 30 మంది కేరళీయులు ఉన్నారు. చుట్టూ ప్రహరీ గోడలు, స్నిప్పర్ రైఫిళ్లతో కాపు కాసే గార్డులతో రోజుకు 16 గంటలు పని చేయించుకుంటున్నారని అక్కడ చిక్కుకున్న ఓ టెకీ మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఎలాగోలా మీడియా ముందుకు వచ్చామని ఇప్పుడు తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని వారు వెల్లడించారు. పాస్ పోర్టు లాక్కుని, మొబైల్ వాడకంపై ఆంక్షలు విధించారని, ఏమైనా అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.
‘మేము ఇప్పుడు బానిసలం.. బతికి ఉండాలంటే ప్రతీరోజు పెద్ద ఎత్తున డేటా చౌర్యం చేయాలి’ అని వాపోయాడు. ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు చెందిన డేటా చోరీ చేయించారని వివరించారు. ఆదేశాలు పాటించకపోతే లాఠీలతో కొట్టేవారని, చీకటి గదిలో నిర్బంధించి తిండి పెట్టకుండా చిత్ర హింసలు పెట్టి చంపుతున్నారని గోడు వెళ్లబోసుకున్నాడు. విడుదల చేయాలంటే క్రిప్టో కరెన్సీలో చెల్లింపులు చేయాలని చెప్తున్నారని, ఇలా ఓ హైదరాబాద్ యువకుడు బయటపడ్డాడని తెలిపాడు. కేరళ వాసులను డేటా ఎంట్రీ జాబుల పేరిట ట్రాప్ చేసి బ్యాంకాక్ చేరుకున్నాక ఎయిర్ పోర్టు వద్ద పికప్ చేసుకొని తర్వాత మయన్మార్‌కి తరలించారని వివరించాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని తమను విడిపించాలని కోరారు. అటు హైద్రాబాదుకు చెందిన సామాజిక కార్యకర్త, ఎంబీటీ నేత అజ్మద్ ఉల్లాహ్ ఖాన్ మాట్లాడుతూ.. బందీలుగా ఉన్నవారిలో 9 మందిని క్రిప్టో కరెన్సీలో చెల్లింపులు చేసి విడిపించామని తెలిపారు. మిగతా వారిని తొందరగా విడిపించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన మనవి చేశారు. కాగా, మయన్మార్ ప్రస్తుతం సైన్యం పరిపాలనలో ఉంది.