అమ్మ ప్రేమకు వెలకట్టలేము. ఆమె ప్రేమకు మించింది ఈ సృష్టిలో మరొకటి లేదు. పిల్లల కోసం జీవితకాలం తల్లి చేసే త్యాగాలు లెక్కించలేము. తన క్షేమం గురించి ఆలోచించదు, ఇష్టా ఇష్టాలను పట్టించుకోదు . బిడ్డలు తప్పు చేస్తే కడుపులో దాచుకుంటుంది. కష్టాల్లో ఉంటే ఓదార్పు అవుతుంది. వారి సంతోషం కోసం అనునిత్యం పోరాడే భూమి మీద ఉన్న ఏకైక నిస్వార్ధమైన జీవి అమ్మ. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు అమ్మ పడే ఆరాటం ఎవరూ పడరు. అలాంటి మాతృమూర్తులను కొంత మంది పిల్లలు అత్యంత దారుణంగా చూస్తున్నారు. వారి త్యాగాలను గుర్తించకపోగా వారి బాధ్యతను విస్మరిస్తున్నారు. కానీ ఓ కొడుకు మాత్రం నవమాసాలు మోసి, పురిటి నొప్పులు పడి, కని, పెంచి, పెద్ద చేసిన తన అమ్మ రుణం తీర్చుకునేందుకు, తన ప్రేమను చాటుకునేందుకు ఓ సాహస యాత్రనే మొదలుపెట్టాడు. తల్లి మనసును అర్థం చేసుకుని ఆమె కోర్కెలు నెరవేర్చేందుకు, సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సైతం వీడి తల్లి సేవలో నిమగ్నమయ్యాడు కర్ణాటకకు చెందిన కృష్ణ కుమార్.
కర్ణాటకకు చెందిన 73 ఏళ్ల రత్నమ్మ కొడుకే ఈ కృష్ణ కుమార్. మైసూర్ ప్రాంతంలో ఈ తల్లీ కొడుకులు నివాసముంటున్నారు. కుటుంబ పోషణ నిమిత్తం కృష్ణ కుమార్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. కృష్ణ కుమార్‌కు అమ్మ అంటే చాలా ఇష్టం. ఆమేకు దేవాలయాలు తిరగాలనే కోరిక ఉండేది. అయితే ఇంటి బాధ్యతల్లో మునిగిపోవడంతో ఆ కోరిక కోరికగానే మిగిలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కృష్ణ కుమార్ తన తల్లి కోరికను నెరవేర్చాలనుకున్నాడు. చేస్తున్న ఉద్యోగానికి రాజీనామ చేసి మాతృసేవా సంకల్పయాత్రను చేపట్టాడు. ఈ యాత్రలో భాగంగా తన తల్లిని దేశవ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాలు, ప్రసిద్ధ ఆలయాలను చూపించేందుకు సిద్ధమయ్యాడు.
యాత్రకు వెళ్తున్నాడు సరే ప్రయాణం ఎందులో చుస్తున్నాడో తెలిస్తే అందరూ అవాక్కవుతారు. తన తండ్రి వాడిన అలనాటి బజాజ్ చేతక్ బండితో 2018 జనవరిలో యాత్ర ప్రారంభించాడు. తన 73 ఏళ్ల తల్లిని బండి వెనకాల కూర్చోబెట్టుకుని కశ్మీర్ నుంచి కన్యాకుమారీ వరకు ఉన్న అన్ని ఆలయాలను చుట్టుముట్టాలని దృడంగా సంకల్పించుకున్నాడు. అలా ఇప్పటి వరకు తమిళనాడు, ఏపీ, తెలంగాణ, బిహార్, మణిపూర్, ఛత్తీస్‌గఢ్ , ఝార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని ఫేమస్ టెంపుల్స్‌ను దర్శించుకున్నారు. కరోనా కారణంగా కొంత కాలం గ్యాప్ తీసుకుని మళ్లీ తమ యాత్రను ప్రారంభించారు.
ఇప్పటి వరకు వీరిద్దరూ 64వేల కిలోమీటర్ల వరకు ప్రయాణించారు. ఈ మధ్యనే అనంతపురంలోని శ్రీ చిన్మయ జగదీశ్వరాలయం, శంకరమఠం, మంత్రాలయం, ఆంజనేయస్వామి వారి ఆలయాలను దర్శించుకున్నారు. తల్లిదండ్రలు భారంగా పీలయ్యే బిడ్డలున్న ఈ రోజుల్లో తల్లి కోరిక తెలుసుకుని అది నెరవేర్చడం కోసం తన భవిష్యత్తును త్యాగం చేసి తల్లి సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన కృష్ణకుమార్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.