గుడిలోకి వచ్చాడని దళితుడి బట్టలు విప్పి ఊరేగింపు.. . - MicTv.in - Telugu News
mictv telugu

గుడిలోకి వచ్చాడని దళితుడి బట్టలు విప్పి ఊరేగింపు.. .

June 13, 2019

దేశంలో దళితులపై దాడులకు అంతులేకుండా పోతోంది. వారిని మనుషులు కారు అనేంత దారుణంగా చూస్తోంది తోటి సమాజం. దేవుడు అగ్ర కులాల వారి సొత్తు అన్నంత దురహంకారంగా ప్రవర్తిస్తున్నారు. సాక్షాత్తు దేవుడే వారికి చెవిలో చెప్పినట్టు దళితులు గుడిలోకి అడుగు పెట్టవద్దని అగ్ర కులాలావాళ్లు అహంకారపూరిత నిబంధనలు పెట్టి వేధిస్తున్నారు. అనాదిగా ఈ దారుణం ఓ దుస్సంప్రదాయంలా కొనసాగుతోంది. బాధితులుగా దళితులే వుంటున్నారు. కర్ణాటకలో ఓ దళితుడు గుడి ఆవరణలోకి వెళ్లాడని అతన్ని చెట్టుకు కట్టేసి చితకాబాదారు. అంతటితో ఆగకుండా అతన్ని నగ్నంగా చేసి ఊరేగించారు.

కర్ణాటకలోని గుండ్లుపేట తాలుకాలోని మాద్రహళ్లిలో జూన్‌ 3వ తేదీన ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రతాప్‌ అనే యువకుడు జూన్‌ 2వ తేదీన రాత్రి మైసూర్‌ నుంచి శ్యాన్డ్రహళ్లికి బయల్దేరాడు. ఇంతలో దారిలో కొందరు దుండగులు ఆ యువకుడిని అడ్డగించి.. అతడి వద్ద ఉన్న నగదును, బైక్‌ను దొంగిలించారు. దీంతో బాధితుడు మాద్రహళ్లికి సమీపంలో ఉన్న శనేశ్వర ఆలయానికి వెళ్లాడు. ఆ రాత్రి అక్కడే బసచేశాడు. ఉదయాన్నే ఆలయానికి పూజారి వచ్చాడు. వచ్చీ రాగానే ఎవరు నువ్వు, నీ కులం ఏంటని అడిగాడు. ప్రతాప్ తాను దళితుడనని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన పూజారి ప్రతాప్‌ను అక్కడే వున్న కొబ్బరిచెట్టుకు బంధించాడు.

మరికొంత మందిని పిలిచాడు. ఆలయాన్ని అపవిత్రం చేశావంటూ.. అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ అందరూ కలిసి చితకబాదారు. అంతటితో ఆగకుండా.. బాధితుడి బట్టలు ఊడదీసి నగ్నంగా ఊరంతా తిప్పారు. ఈ దారుణాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. వీడియో వైరల్ అయింది. దీంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రతాప్‌పై దాడిచేసిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.